అక్రమార్కులకు ‘ప్లానింగే’ అండ

2 Jul, 2017 23:28 IST|Sakshi
అక్రమార్కులకు ‘ప్లానింగే’ అండ

- నగరంలో పుట్టగొడుగుల్లో అక్రమ నిర్మాణాలు
- కమిషనర్‌ తనిఖీలో బట్టబయలు
- భవనాలు కూల్చేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు
- నేనున్నానంటూ అభయమిస్తున్న ఓ ఎమ్మెల్యే


అనంతపురం న్యూసిటీ : అనంతపురంలో అక్రమ కట్టడాలకు టౌన్‌ ‘ప్లానింగ్‌’ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. వారు వివిధ డివిజన్లలో స్థానికంగా అధికార పార్టీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడం వల్లే అక్రమ కట్టడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న ఆరోపణలూ ఉన్నాయి. గత ఏడాదిగా నిబంధనలకు విరుద్దంగా నగరంలో వెలసిన అనేక కట్టడాలే ఇందుకు నిదర్శనమని విమర్శకులు చెబుతున్నారు. కాగా, నీతీ నిజాయితీ అని చెప్పే ఓ ప్రజాప్రతినిధి నిర్మించే భవనం సైతం నిబంధనలకు విరుద్ధంగానే ఉంది. అలాగే శ్రీనగర్‌ కాలనీలో చైతన్య టెక్నో స్కూల్‌ భవనం సైతం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారు. వేలాది మంది విద్యార్థులు ఉండే పాఠశాల అయినప్పటికీ ప్రాథమిక నిబంధనలు పాటించలేదు. సెట్‌బ్యాక్స్‌(భవనం చుట్టూ స్థలం) వదల్లేదు. అదనపు ఫ్లోర్లు నిర్మించారు. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం వాటిల్లితే పిల్లలను రక్షించడం చాలా కష్టమవుతుందని స్వయంగా అధికారులే విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ కమిషనర్‌గా పీవీవీఎస్‌ మూర్తి బాధ్యతలు తీసుకున్నాక స్వయంగా ఆయనే రంగంలోకి దిగడంతో వీటితోపాటు మరికొన్ని అక్రమ కట్టడాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై టీపీఓతో మొదలుకుని టీపీఎస్, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఆయన మెమోలు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల గుండెల్లో గుబులు పుట్టింది. ఉన్నఫళంగా భవనాలు కూల్చితే యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారు భయపడుతున్నారు. గత నెలలో కొన్ని భవనాలను పాక్షికంగా తొలగించినప్పుడు అధికార పార్టీకి చెందిన ఓ నేత బిల్డర్లను వెంట పెట్టుకుని వెళ్లి ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ‘నేనున్నా’నని, భయపడాల్సిన పని లేదని వారికి అభయమిచ్చినట్లు సమాచారం.

మెమోలిచ్చాం
నగరంలో 31 అక్రమ నిర్మాణాలను గుర్తించాం. అందుకు సంబంధించి టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి మెమోలు జారీ చేశాం. వారిచ్చే నివేదికనుబట్టి తదుపరి చర్యలుంటాయి.
- పీవీవీఎస్‌ మూర్తి, కమిషనర్‌

మరిన్ని వార్తలు