పట్టా భూమికి పక్కా స్కెచ్‌

14 Sep, 2017 22:32 IST|Sakshi
పట్టా భూమికి పక్కా స్కెచ్‌

కియా మాటున దందా
భూసేకరణ స్కెచ్‌లో తిరకాసు
మొదటి స్కెచ్‌లోని 16 ఏకరాలు రెండవ స్కెచ్‌లో మాయం
ముఖ్య ప్రజాప్రతినిధికి అనుకూలంగా మార్పులు
బహిరంగ మార్కెట్‌లో 16 ఎకరాల విలువ రూ.24 కోట్లు
రైతు నుంచి ఎకరా రూ.30.25 లక్షలకు కొనుగోలు


అధికారం ఉంది... చెప్పింది వినే అధికారులూ ఉన్నారు. అందుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకుంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సొమ్ము చేసుకుంటున్నారు. అంతిమంగా బాధితులకు అన్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కియా’​‍ను అడ్డంపెట్టుకుని కోట్లు కొళ్లగొట్టేందుకు సిద్ధమయ్యారు.

అనంతపురం అర్బన్‌: కియా మోటార్స్‌ పరిశ్రమకు సంబంధించి భూ సేకరణ మాటున అధికార పార్టీ నేతలు ‘జాదూ’కి తెరలేపారు. రూ.కోట్లు విలువ చేసే భూమిని తమ వశం చేసుకునేందుకు పథకం రచించారు. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు ‘ఒక్కటై’ వ్యవహారం నడిపారు. భూ సేకరణకు సంబంధించి తొలిగా విడుదల చేసిన స్కెచ్‌లో 16 ఎకరాల పట్టా భూమిని కూడా చేర్చారు. అయితే నాలుగులేన్ల రహదారిపై ఉన్న ఈ భూమిపైన అధికార పార్టీ నాయకులు కొందరు కన్నెశారు. ఒక ముఖ్యప్రజాప్రతినిధి సూచన మేరకు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి స్కెచ్‌లో మార్పులు చేశారు. మొదటి స్కెచ్‌లో సేకరణకు కింద చూసిన 16 ఎకరాల భూమి తప్పించి రెండవ స్కెచ్‌ సిద్ధం చేశారు.

ఇలా కథ నడిపారు
కియా మోటర్స్‌ పరిశ్రమ కోసం పెనుకొండ సమీపంలో 600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందులో పట్టా భూములు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో 179 సర్వే నంబరులోని 16 ఎకరాల భూమిని కూడా సేకరించేలా తొలుత స్కెచ్‌ను విడుదల చేశారు. అయితే ఈ 16 ఎకరాల భూమి పరిశ్రమలకు ఎదురుగా ఉన్న రోడ్డు బిట్‌ కావఽడంతో తమ వశం చేసుకోవాలని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కథ నడిపారు. రెవెన్యూ అధికారుల సాయంతో రెండవ స్కెచ్‌లో ఈ 16 ఏకరాల భూమిని తప్పించారు.

భూమి విలువ రూ.24 కోట్లు
ప్రస్తుతం కియా మోటర్స్‌ పరిశ్రమ పరిసరాల్లో రోడ్డు బిట్‌ భూమి బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.1.50 కోట్లు  పలుకుతోంది. ఆ లెక్కన 16 ఎకరాల భూమి విలువ రూ.24 కోట్లు ఉంటుంది. వాస్తవంగా భూ సేకరణ కింద భూమిని తీసుకుని ఉంటే ఎకరాకు రూ.10.50 లక్షలుగా ఇచ్చే వారు. భూ సేకరణ కింద 16 ఎకరాలు తప్పించి రైతులతో బేరసారాలు నడిపారు. రైతులు ఒప్పకోకపోతేæ 16 ఎకరాలను భూ సేకరణ కింద తిరిగి చేర్చాలని పథకం రచించారు. భూ సేకరణ కింద పోతే ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున  16 ఎకరాలకు రూ.1.68 కోట్లు మాత్రమే వస్తుందనీ, తాము చెప్పినట్లు వింటే ప్రభుత్వం ఇచ్చేదానికంటే రెండింతలు ఎక్కవగా ఇస్తామన్నారు. దీంతో రైతులు ఎకరా రూ.30.25 లక్షలకు విక్రయించేలా అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 16 ఎకరాలకు గానూ ఇక్కడ రైతులకు వారు ఇచ్చేది రూ.4.84 కోట్లు.

రైతులకు రూ.19.16 కోట్లు నష్టం
ఈ భూమి వ్యవహారంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే అధికార పార్టీకి చెందిన వారు ఇస్తున్న మొత్తమే ఎక్కవగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇందులో రైతులు నష్టపోయేది రూ.19.16 కోట్లు. భూసేకరణ నుంచి తప్పించిన భూమిని రైతులకు వదిలేసి ఉంటే వారికి లబ్ధి చేకూరేది. బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఎకరా రూ.1.50 కోట్లకు విక్రయించుకునేవారు. ఈ లెక్కన 16 ఎకరాలకు వారికి రూ.24 కోట్లు వచ్చేవి.  కానీ ఇప్పుడు రైతుల నుంచి దక్కించుకున్న 16 ఎకరాల భూమి ద్వారా అధికార పార్టీ నాయకులకు భారీ లబ్ధి పొందారు.

మరిన్ని వార్తలు