పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు

20 Aug, 2017 03:17 IST|Sakshi
పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు

► ముందస్తుగా జిల్లాకు 10 డీఆర్‌సీలు
► జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి


కర్నూలు(అర్బన్‌):
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి చెప్పారు. శనివారం స్థానిక డీపీఓ కార్యాలయంలో ఈఓఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ముందుగా పలు గ్రామ పంచాయతీల్లో సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్లు షెడ్లు ఏర్పాటు చేసి వర్మీకంపోస్టు ఎరువు తయారీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే జిల్లాలోని పాణ్యం, అయ్యలూరు, కోవెలకుంట్ల, హోళగుంద, ఆలూరు, గోనెగండ్ల, గార్గేయపురం, లక్ష్మీపురం, వెల్దురి, పాములపాడు గ్రామ పంచాయతీల్లో డిస్ట్రిక్ట్‌ రిసోర్సు సెంటర్లు (డీఆర్‌సీ)  ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. ఒక్కో సెంటర్‌కు ఐదు గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తామన్నారు. అక్కడ తడిపొడి చెత్త వేరుచేయడం, వర్మీ కంపోస్టు యూనిట్‌కు అవసరమైన పేడను రైతుల నుంచి సేకరించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతకు ముందుగా   14వ ఆర్థిక సంఘం నిధులతో డస్ట్‌బిన్లను ఆయా గ్రామ పంచాయతీలు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. చెత్త సేకరణ కోసం ప్రతి వెయ్యి జనాభాకు ఒక ట్రైసైకిల్‌ అందజేస్తామన్నారు.  సమావేశంలో కర్నూలు డివిజనల్‌ పంచాయతీ అధికారి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు