ప్లేట్‌లెట్లు ఎక్కడ సారూ?

30 Sep, 2016 22:37 IST|Sakshi
ప్లేట్‌లెట్లు ఎక్కడ సారూ?
  •  విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు 
  •  పడిపోతున్న ప్లేట్‌లెట్లు 
  •  ప్రభుత్వాస్పత్రిలో లేని వైనం
  •  ప్రైవేటు సెంటర్లను ఆశ్రయిస్తున్న బాధితులు 
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    జిల్లాలో డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలతోపాటు టైఫాయిడ్, ఇతర వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జ్వరాల బారిన పడుతున్నారు. శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గుతుండడంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సీజన్‌ కావడం, అపారిశుద్ధ్యం కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దోమలు వ్యాప్తి చెందకముందు తీసుకోవాల్సిన నివారణ చర్యలను అదుపుతప్పిన తర్వాత చేపట్టడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 
     
    80 శాతం జ్వరం కేసులే...
    పారిశుద్ధ్యలేమితోపాటు ఈ మధ్య కాలంలో ప్రతి రోజు వర్షాలు కురుస్తుండడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పట్టణాలలోని కొన్ని ప్రాంతాలు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు పారుతోంది. మరికొన్ని చోట్ల ఉన్న డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. ఫలితంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు దోమకాటుకు గురువుతున్నారు. ఒకరికి వైరల్‌ ఫీవర్‌ వచ్చినా మొత్తం వరుస పెట్టి ఇంట్లో వారందరికీ ఇది వ్యాప్తి చెందుతోంది. జ్వర పీడితులతో ప్రభుత్వ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. రోజుల తరబడి 102 డిగ్రీలపై జ్వరం ఉంటుండడంతో రోగులు నీరసించిపోతున్నారు. డెంగీ, మలేరియా, ఇతర  వైరల్‌ జ్వరాలు వల్ల కూడా రోగి శరీరంలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారిలో 80 శాతం మంది జ్వరపీడితులుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చిన్నపిలల్ల ఆస్పత్రులకు వచ్చే ఓపీలో 70 శాతం జ్వరంతో బాధపడుతున్న చిన్నారులే ఉంటున్నారు.
     
    ప్లేట్‌లెట్ల కోసం పరుగులు..
    డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్‌ జ్వరాల వల్ల ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయి. ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల నుంచి రాజమహేద్రవరం ప్రభుత్వాస్పత్రికి రోగులు పరుగులు పెడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి ప్రతి రోజూ మలేరియా బాధితులు చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజు 40 నుంచి 50 మలేరియా జ్వరం ఓపీలు నమోదువుతున్నాయి. ఈ నెలలో 9 మలేరియా పాజిటివ్, 11 హెచ్‌బీఎస్‌ఏజీ కేసులు నమోదయ్యాయి. రోజుకు పదికి తగ్గకుండా డెంగీ పరీక్షలు చేస్తున్నారు. డెంగీ కేసులు లేవని చెప్పేందుకు ‘మెడాల్‌’ సంస్థపై ఒత్తిడి తెచ్చి పరీక్షలు నెగిటివ్‌గా చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. టైఫాయిడ్‌ జ్వర పీడితులు ఎక్కవగా వస్తున్నారు. ఈ నెలల్లో ఇప్పటి వరకు 402 టైఫాయిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలో కాకినాడ ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి తర్వాత ప్రధానమైన ఈ ఆస్పత్రిలో ప్లేట్‌లెట్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. రూ. వేలల్లో ఖర్చు అవుతుండడంతో అప్పుల పాలవుతున్నారు. 
     
    త్వరలో అందుబాటులోకి వస్తాయి
    స్థానికంగా ఉన్న బ్లడ్‌ బ్యాంకులో ప్లేట్‌లెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. పరికరాలు కొనుగోలు చేశాం. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చింది. అతి త్వరలో ప్లేట్‌లెట్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.  
    – డా. టి.రమేష్‌ కిశోర్, సూపరింటెండెంట్‌. జిల్లా ఆస్పత్రి, రాజమహేంద్రవరం
     
     
మరిన్ని వార్తలు