బిడ్డ కారుణ్యమరణానికి అనుమతించండి

14 Aug, 2016 08:45 IST|Sakshi
చిన్నారి మహేష్‌తో తల్లిదండ్రులు బుడ్డప్ప, నరసమ్మ.
పుంగనూరులో తల్లిదండ్రుల అభ్యర్థన
తోసిపుచ్చిన న్యాయమూర్తి
వైద్యానికి చొరవ తీసుకుంటామని కౌన్సెలింగ్‌
 
పుంగనూరు: బీద కుటుంబం..దారుణమైన వ్యాధి సోకింది. ఉన్నదంతా వైద్యానికి వెచ్చించినా నయంకాలేదు. మరణానికి చేరువవుతున్న బిడ్డను చూడలేక అతనికి కారుణ్యమరణానికి అనుమతించాలని తల్లిదండ్రులు అభ్యర్థించిన వైనం చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగంది.  రామసముద్రం మండలం దిన్నిపల్లెకు చెందిన బుడ్డప్పకు కర్నాటక సోమయాజులపల్లెకు చెందిన నరసమ్మతో 2010లో పెళ్లయింది. బుడ్డప్ప పుంగనూరులో క్షౌరవృత్తి చేసుకుంటున్నాడు. వీరికి మహేష్‌ (5), వేదవతి(3) పిల్లలు. గత సంవత్సరం మహేష్‌ ఆనారోగ్యానికి గురయ్యాడు. బెంగళూరులోని ఇందిరాగాందీ వైద్యశాలలో 30 రోజుల పాటు చికిత్స చేయించారు. అక్కడి వైద్యులు బోన్‌క్యాన్సర్‌గా నిర్ధారించారు. అప్పటికే అప్పులు చేసి, సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసిన బుడ్డప్పకు ఆర్థికంగా చితికిపోయాడు. ఇబ్బందులకు గురైయ్యాడు. మరోమారు అప్పు చేసి వేలూరు సీఎంసీ ఆస్పత్రికి వెళ్లారు.

అక్కడ వైద్యులు చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అంత డబ్బులు సమకూర్చలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. మరోపక్క కళ్లెదుట కుమారుడు మృత్యువుకు దగ్గరవుతూ అవస్థ పడటాన్ని చూసి భరించలేకపోయారు ఆ దంపతులు. వైద్యం చేయించే స్తోమత లేని నిస్సహాయ స్థితిలో తమ బిడ్డకు కారుణ్యమరణానికి అనుమతించాలని ఈ దంపతులు శనివారం పుంగనూరులో న్యాయమూర్తి మోతీలాల్‌కు వినతిపత్రం అందజేశారు.

న్యాయమూర్తి మోతీలాల్‌ చలించిపోయారు. ఇందుకు అనుమతి ఇవ్వలేమని సున్నితంగా చెప్పారు. మండల న్యాయసేవా సమితి ద్వారా బిడ్డకు చికిత్స చేయించేందుకు న్యాయస్థానం చొరవ తీసుకుంటుందన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఓదార్చి కాస్సేపు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ విషయమై న్యాయమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడుతున్న మహేష్‌కు చికిత్స చే యించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని వార్తలు