జీతాలివ్వండి మహాప్రభో..!

3 Apr, 2017 00:21 IST|Sakshi
జీతాలివ్వండి మహాప్రభో..!
– అంగన్‌ వాడీలకు అందని వేతనాలు
– నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి
– పట్టించుకోని ఉన్నతాధికారులు 
 
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు : 5,126
అంగన్‌వాడీ కార్యకర్తలు : 4,082
ఆయాలు : 3,698
నెలకు రావాల్సిన జీతం : రూ.4,52,15,000
పెండింగ్‌లో ఉన్న మొత్తం : రూ.18,08,60,000
 
అనంతపురం టౌన్‌ :  ఒకటో తేదీ పడాల్సిన జీతం.. రెండ్రోజులు ఆలస్యమైతే వేతన జీవుల ఆందోళన అంతా ఇంతా కాదు. మరి ఏకంగా నాలుగు నెలల నుంచి జీతమే రాలేదంటే.. ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుంది. అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల పరిస్థితి ఇలాగే ఉంది. గత ఏడాది డిసెంబర్‌ నుంచి జీతాలు రాకపోవడంతో వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 
 
జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) కింద 17 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,286 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు, 840 మినీ కేంద్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,082 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. ఏ నెలలోనూ వీరు సక్రమంగా జీతం తీసుకున్న పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడూ వేతనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు జీతం రాలేదు. ఒక్కో అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.7 వేలు, ఆయాకు రూ.4,500 జీతం ఇస్తున్నారు. నాలుగు నెలలది కలిపి సుమారు రూ.19 కోట్ల వరకు వేతన బకాయిలు ఉన్నాయి. తమకు జీతాలు సక్రమంగా విడుదలయ్యేలా చూడాలని యూనియన్ల నేతలు వినతిపత్రాలు అందజేస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. అధికారులు మాత్రం నెలనెలా జీతాలు తీసుకుంటూ కార్యకర్తలు, ఆయాలను మాత్రం పట్టించుకోవడం లేదు.  
 
అప్పులపాలవుతున్న కుటుంబాలు : 
జీతాలు సక్రమంగా విడుదల కాకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కుటుంబం గడవడమే కష్టంగా మారుతోంది. నెలల తరబడి అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బకాయిలు, కూరగాయల బిల్లులు, ఫైర్‌వుడ్‌ చార్జీలను కూడా చెల్లించడం లేదని కొందరు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
 
ఎప్పుడొస్తుందో తెలీదు 
నాలుగు నెలల నుంచి అంగన్‌వాడీలకు జీతం రాని విషయం వాస్తవమే. బడ్జెట్‌ రిలీజ్‌ అయింది. ట్రెజరీకి బిల్లులు కూడా పెట్టాం. కానీ చివరి నిమిషంలో జీతాలు ఇవ్వలేకపోయాం. ఎప్పుడొస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేం. 
– జుబేదాబేగం, ఐసీడీఎస్‌ పీడీ
 
 
ఆందోళనకు సిద్ధం
ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. చాలా మంది అప్పులు చేసి సెంటర్లు నిర్వహించుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదు. ఇప్పటికే జీతాల విషయమై ఐసీడీఎస్‌ అధికారులను సంప్రదించాం. త్వరలోనే ఆందోళనకు శ్రీకారం చుడతాం.  
– వి.వనజ, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి 
 
మరిన్ని వార్తలు