నష్టపోయిన రైతులను ఆదుకోండి

19 Oct, 2016 21:53 IST|Sakshi
నష్టపోయిన రైతులను ఆదుకోండి
  •  నకిలీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
  •   రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
  •   నాలుగేళ్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి
  •   సుబాబుల్, జామాయిల్‌ కర్రకు పాత ఒప్పందం మేరకే ధర ఇవ్వాలి
  •   వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి
  • సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నకిలీ విత్తనాలతో జిల్లాలో మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణం వారిని ఆదుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారన్నారు. ఎకరాకు రూ.70 వేలకుపైగా పెట్టుబడులు పెట్టారని, తీరా కాపుకు వచ్చే సమయానికి మిరప పూత, పిందె రాలేదన్నారు.
     
    నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరుస కరువులతో గత నాలుగేళ్ల పాటు జిల్లా రైతాంగం పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ.90 కోట్లకుపైగా ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాల్సి ఉన్నా... ఇప్పటి వరకు ప్రభుత్వం పైసా చెల్లించకపోవడం దారుణమన్నారు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ చంద్రబాబు సర్కారు ఒట్టి మాటలు చెప్పడం మినహా ఆచరణలో రైతులను వంచిస్తోందని బాలినేని విమర్శించారు. రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా సర్కారు తక్షణం ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 
    గిట్టుబాటు ధర కల్పించాలి 
    గిట్టుబాటు ధర రాకపోవడంతో జిల్లాలోని సుబాబుల్, జామాయిల్‌ రైతులు నష్టపోతున్నారన్నారు. గతంలో టన్ను జామాయిల్‌ రూ.4,600, సుబాబుల్‌ రూ.4,400లు చెల్లించేలా పేపర్‌ మిల్లుల యజమానులు, రైతుల మధ్య ప్రభుత్వం ఒప్పందం చేసిందన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రైతులను వంచించడమే ధ్యేయంగా జీఓ నం.143ను తెరపైకి తెచ్చారన్నారు. తాజాగా ప్రభుత్వం జామాయిల్‌ రూ.4,200, సుబాబుల్‌ రూ.4 వేల చొప్పున కొనుగోలు చేస్తామంటూ ప్రకటించారన్నారు.
     
    ప్రస్తుతం ఆ ధరకు కూడా పేపర్‌ మిల్లుల యజమానులు రైతుల వద్ద కర్రను కొనుగోలు చేయడం లేదని బాలినేని పేర్కొన్నారు. తక్షణం 143 జీఓను రద్దు చేసి పాత ఒప్పందం మేరకే సుబాబుల్, జామాయిల్‌ను రైతుల వద్ద కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్‌ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. రైతు సంఘాల ఆందోళనకు మద్దతు తెలుపుతామన్నారు. 
మరిన్ని వార్తలు