విదేశాల్లోని నల్లధనాన్నీ మోదీ రప్పిస్తారు

26 Nov, 2016 00:54 IST|Sakshi
విదేశాల్లోని నల్లధనాన్నీ మోదీ రప్పిస్తారు
విశాఖ అవగాహన సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్య
 సాక్షి, విశాఖపట్నం: విదేశాల్లోని నల్లధనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రప్పిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లధనం వెలికితీతపై తొలి తీర్మానం, పోలవరం ప్రాజెక్టుపై మలి తీర్మానం చేశారని, అప్పట్నుంచే ప్రధాని నల్లధనంపై యుద్ధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందంతో స్విస్ బ్యాంక్ ఖాతాల్లో దాచుకున్న భారతీయుల నల్లధనం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయన్నారు. 
 
 ‘నల్లధనంపై మోదీ సమరం..’ పేరిట పెద్దనోట్ల మార్పిడిపై శుక్రవారం సాయంత్రం విశాఖ బీజేపీ కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక అసమానతల్ని సరిచేయడానికే ప్రధాని పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇది అన్నాహజారే స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయమన్నారు. మోదీ తిరుగుబాటుదారుడని, పరిస్థితులతో రాజీపడరని, గుజరాత్‌లో మూడు దఫాలు ఆ పట్టుదలతోనే విజయం సాధించారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు చర్య వల్ల వేలాదిమందికే నష్టమని, కోట్లాదిమంది పేద, మధ్యతరగతి వారికి లాభం చేకూరుతుందన్నారు.
 
మరిన్ని వార్తలు