‘పోడు’ పాడు

2 Aug, 2016 23:57 IST|Sakshi
ప్రభుత్వ సిబ్బందిని అడ్డుకునేందుకు ఒడ్డుగూడెంలో పాడైన మొక్కజొన్నతో రైతుల ఆందోళన

ఇల్లెందు మండలం రొంపేడులో 8 హెక్టార్ల మొక్కజొన్న..
టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలో కొనసాగిన పంటల ధ్వంసం

  • – పోడు భూముల్లో హరితహారం
  • – అడ్డుకున్న గ్రామస్తులు
  • – రొంపేడు, ఒడ్డుగూడెంలలో ఉద్రిక్తత
  • – పోలీస్, అటవీశాఖ సిబ్బంది మోహరింపు


ఇల్లెందు/ టేకులపల్లి:
    ఇటు ఇల్లెందు మండలం రొంపేడు, అటు టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలలో అటవీశాఖ అధికారులు మంగళవారం పంటలను ధ్వంసం చేశారు. రొంపేడులో న్యూడెమోక్రసీ నేతలకు చెందిన 8 హెక్టార్ల మొక్కజొన్న చేనును పోలీస్‌ రక్షణతో తొలగించారు. ఎన్డీ జిల్లా నాయకులు నాయిని రాజు, మండల నాయకులు తోడేటి నాగేశ్వరరావు, మరొకరికి చెందిన 8 హెక్టార్ల మొక్కజొన్నను మూడు ట్రాక్టర్ల సహాయంతో ధ్వంసం చేశారు. కోటిలింగాల వద్ద ఎన్డీ నేత బోసుకు చెందిన 8 ఎకరాల పంటను ధ్వంసం చేసిన మరుసటిరోజే రొంపేడులో అదేపార్టీకి చెందిన ఇద్దరు నేతల చేలను ధ్వంసం చేయడం గమనార్హం. ఉదయమే పంట చేను వద్దకు మూడు ట్రాక్టర్లు, పోలీస్, అటవీశాఖ సిబ్బంది చేరుకున్నారు. తమ పంటలను తొలగించ వద్దని పోడురైతులు నాయిని రాజు, తోడేటి నాగేశ్వరరావు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఇల్లెందు రేంజర్‌ బీవీవీఎస్‌కే ప్రసాద్‌ను వేడుకున్నారు. ఆయన వినకపోవడంతో మహిళలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని పంటను ధ్వంసం చేస్తున్న ట్రాక్టర్లకు అడ్డుపడ్డారు. అటవీశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అటవీశాఖ సిబ్బంది వారిని తొలగించి పంటలను ధ్వంసం చేశారు.

  •  మరో నెలరోజుల్లో పంట చేతికొస్తుందనే దశలో అటవీ, పోలీసుశాఖల సిబ్బంది ఈ విధ్వంసానికి పాల్పడ్డారని బాధిత రైతు నాయిని రాజు వాపోయారు. ఉన్న ఆరు ఎకరాల్లో కనీసం రెండు ఎకరాలను కూడా వదలకుండా ధ్వంసం చేశారన్నారు. వేసవిలోనే సమాచారం ఇచ్చివుంటే సాగు చేసేవాళ్లం కాదన్నారు.

– సమాచారం ఇచ్చినా సాగు చేశారు: బీవీవీఎస్‌కే ప్రసాద్, రేంజర్‌
అన్యాక్రాంతమైన భూముల్లో సాగు చేయవద్దని గత వేసవిలోనే సమాచారం ఇచ్చాం. హరితహారంలో భాగంగా కొమ్ముగూడెం బీట్‌లో 45 హెక్టార్లలో మొక్కలు నాటాలని నిర్ణయించాం. ఒకే చోట 8 హెక్టార్లలో సాగు చేశారు. 2005 డిసెంబర్‌ 13 తర్వాత పోడు నరికి పంటలు సాగు చేసిన భూములను అటవీశాఖ స్వాధీనం చేసుకుంటుంది. మొక్కలు నాటుతుంది.
ఒడ్డుగూడెంలోనూ విధ్వంసం
మరోవైపు టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలోనూ పంటల విధ్వంసం కొనసాగుతోంది. సోమవారం పంటలు ధ్వంసం చేసిన అధికారులు మంగళవారం కూడా కొనసాగించారు. చాతకొండ రిజర్వ్‌ఫారెస్టు, కొప్పురాయి బీట్‌ ఒడ్డుగూడెంలోని కంపార్ట్‌మెంట్‌ నంబర్‌ 30లో మొత్తం 200 హెక్టార్ల భూమి ఉంది.  ఇందులోని  125 ( 50 హెక్టార్లు) ఎకరాల్లో ఫారెస్టు అధికారులు మొక్కలు నాటేందుకు పూనుకున్నారు. ఈ భూముల్లో కొప్పురాయి, ఒడ్డుగూడెం, రాజారాంతండా, బర్లగూడెం గ్రామాలకు చెందిన గిరిజనులు గత కొన్నేళ్ళుగా పంటలు సాగు  చేస్తున్నారు. ఈ భూముల్లోనే హరితహారం మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఎఫ్‌ఆర్వో మంజుల నేతృత్వంలో ఫారెస్టు అధికారులు, సిబ్బంది యత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే జూలై 23న, ఈనెల 1న గిరిజనుల పంట చేలను ధ్వంసం చేశారు. సోమవారం ఒడ్డుగూడెంలో  40 ఎకరాల వరకు పంటలను ధ్వంసం చేసిన ఫారెస్టు, పోలీసు అధికారులు మంగళవారం కూడా దాడులను కొనసాగించారు. మిగిలిన పంటలను ధ్వంసం చేసేందుకు 10 ట్రాక్టర్లు, 50 మంది ఫారెస్టు, పోలీసుశాఖ సిబ్బందితో ఒడ్డుగూడెం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సుమారు 200 మంది రైతులు ఒడ్డుగూడెంలో పాడైన మొక్కజొన్న మొక్కలను చేతపట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. అటవీ, పోలీస్‌ అధికారులను సుమారు గంటపాటు అడ్డుకున్నారు. గత్యంతరం లేక ఫారెస్ట్‌ అధికారులు రాజారాంతండా మీదుగా అడ్డదారిలో ఒడ్డుగూడెం చేరుకున్నారు.
ఆగని పంటల ధ్వంసం
 ఒడ్డుగూడెం, రాజారాంతండా గ్రామస్తులు, రైతులు భారీ సంఖ్యలో పంట చేల వద్దకు వచ్చారు. ట్రాక్టర్‌ డ్రైవర్లు, ఫారెస్టు అధికారులను నిలదీశారు. అప్పటికే మోహరించి ఉన్న ఫారెస్టు, పోలీసు అధికారులు, సిబ్బంది రైతులను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపుగా పెరిగిన చేనును అన్యాయంగా ధ్వంసం చేశారని బాధిత రైతులు దళ్‌సింగ్, ఆయన భార్య కల్యాణి గుండెలవిసేలా రోదించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తున్న నేపథ్యంలో న్యూడెమోక్రసీ, సీపీఐ నాయకులు జోక్యం చేసుకున్నారు. రైతులను శాంతింపజేసి ఫారెస్టు, పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. డీఎఫ్‌ఓతో మాట్లాడుతాం.. రెండు రోజులపాటు దాడులు ఆపాలని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎఫ్‌ఆర్వో, ఎస్సై రెండు రోజుల సమయం ఇచ్చారు. బాధిత రైతులు ఎన్డీ ఆధ్వర్యంలో డీఎఫ్‌ఓను కలిసేందుకు వెళ్లారు. ఈ ఆందోళనలో ఎన్డీ నేతలు గణితి కోటేశ్వర్‌రావు, రాంచందర్, దుర్గారావు, సీపీఐ జిల్లా, డివిజన్‌ నేతలు ఏపూరి బ్రహ్మం, దేవరకొండ శంకర్, సూర్యం, రాంచందర్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు