గొంతులో గరళం

22 Aug, 2016 23:57 IST|Sakshi
గొంతులో గరళం
 చుట్టూ నీరున్నా తాగేందుకు గుక్కెడు మంచినీరు లేక కొల్లేటి గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. పంట బోదెలు, డ్రెయిన్ల నీరే వారికి దిక్కయ్యింది. చేపల చెరువుల వ్యర్థాలు వాటిల్లోకి వదిలేస్తుండడంతో రోగాలబారిన పడుతున్నామని వాపోతున్నారు. కొల్లేటి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ఉద్దేశించిన గుండుగొలను సమగ్ర మంచినీటి పథకం పనులు ఐదేళ్లుగా సా..గుతూనే ఉన్నాయి. 
భీమడోలు : కొల్లేరు ప్రజలకు స్వచ్ఛజలాన్ని అందించాలనే సంకల్పంతో చేపట్టిన గుండుగొలను సమగ్ర మంచినీటి ప్రాజెక్టు పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం చేపట్టిన పనులకు కాంట్రాక్టర్‌ అలసత్వం, నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపాలు శాపాలుగా మారాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు పంట బోదెలు, డ్రెయిన్ల నీరే తాగాల్సి వస్తోంది. ఆక్వా రైతులు కలుషిత వ్యర్థాలను ఆ డ్రెయిన్లలోకి వదిలేస్తుండడంతో ఆ నీరి తాగి రోగాల బారిన పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. 
ఇప్పటి వరకు ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ల విస్తరణ పనులను చేపట్టారు.  
పూర్తికాని సమగ్ర మంచినీటి పథకానికి శ్రీకారం
రూ.4.50 కోట్లతో గుండుగొలను వద్ద సమగ్ర మంచినీటి పథకాన్ని నిర్మాణానికి ఐదేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. గుండుగొలను మంచినీటి ప్రాజెక్టు పరిధిలో గుండుగొలనుతో పాటు కొల్లేరు గ్రామాలైన ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరం, లక్ష్మీపురం, సీతారామనగరం, భోగాపురం, వడ్డిగూడెం, కోరుకల్లు, రత్నాపురం, బద్రికోడు, పైడిదిబ్బ తదితర గ్రామాల్లోని 23 వేల మంది ప్రజలకు పైప్‌లైన్ల ద్వారా రక్షిత మంచినీటిని అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. గుండుగొలనులో ఉన్న మంచినీటి చెరువు ద్వారా 11 గ్రామాలకు నీరందించడం కష్టంగా మారిన నేపథ్యంలో పెద్ద చెరువులో ఐదు ఎకరాల్లో చెరువును తవ్వాలని పనులు ఉపక్రమించారు. రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పనులు పూర్తికావడం లేదు. చెరువు సంగతి అలా ఉన్నా మిగిలిన పనులు పూర్తి చేస్తే ప్రస్తుతం ఉన్న చెరువు నుంచి కొంతమేర అయినా తాగునీటిని అందించవచ్చు. అయితే ఆ పనుల పూర్తిపై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
కలుషితమైన ఛానల్‌.. ఆగడాలలంక ఛానల్‌ ద్వారా గోదావరి నీటిని కొల్లేరు గ్రామాల్లోని మంచినీటి చెరువును నింపుకుంటారు. అయితే ఛానల్‌ వెంబడి చేపల చెరువులు విస్తరించడంతో ఆ మురుగునీరంతా ఛానల్‌లోకి చేరుతుంది. ఆ నీరు మంచినీటి చెరువులో చేరుతుంది. ఆ నీటినే వడ్డిగూడెం, లక్ష్మీపురం, ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరం గ్రామాల ప్రజలు తాగి అనారోగ్యం పాలవుతున్నారు. రత్నాపురం పంచాయతీ పరిధిలోని రత్నాపురం, కోరుకల్లు, పైడిదిబ్బ, బద్రికోడు గ్రామాలకు పంట బోదెల ద్వారానే నీరు చేరుతుంది. వీటి పరిస్థితీ అంతే. ఇక్కడ చేపల చెరువు వల్ల కలుషితమవుతున్నాయి. అనేక చోట్ల పైప్‌లైన్లు పగిలిపోవడంతో మురుగునీరు అందులో కలుస్తోంది. దీంతో ప్రజలకు మంచినీటి టిన్నులే గతయ్యాయి. 
చుట్టూ నీరున్నా ఫలితం లేదు
కొల్లేటి గ్రామాల చుట్టూ నీరున్నా తాగేందుకు ఉపయోగపడడం లేదు. ఐదు కిలోమీటర్ల మేర సైకిల్‌పై గుండుగొలను వెళ్లి టిన్నులు కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. గ్రామానికి వచ్చే నీరు వాడకానికి ఉపయోగిస్తున్నాం. కలుషితమైపోవడంతో రోగాలు వస్తున్నాయి. – ఆదిని దుర్గారావు, కోరుకల్లు 
త్వరలో పనులు పూర్తి చేస్తాం
గుండుగొలను మంచినీటి ప్రాజెక్టు పనులను చురుగ్గా చేయిస్తున్నాం. త్వరలోనే పూర్తవుతాయి. గుండుగొలను వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, పలు గ్రామాల్లో ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. పనులను మరింత వేగవంతం చేస్తాం.– ఎం.శ్రీనివాస్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్, భీమడోలు
 
>
మరిన్ని వార్తలు