పోల‘వరం’.. కారాదు శాపం

19 Dec, 2016 00:14 IST|Sakshi
  •  చట్టానుసారం పరిహారం ఇవ్వాలి
  • లేకుంటే ప్రభుత్వంపై జాతీయస్థాయిలో ఉద్యమం
  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పార్టీలు, సంఘాల నేతలు
  • గోదావరిపై పోలవరం ప్రాజెక్టు.. తెలుగుజాతి చిరకాలపు కల. అదే ప్రాజెక్టు నిర్వాసితుల పాలిట పీడకలలా పరిణమిస్తోంది. ప్రాజెక్టు వల్ల ఎన్నో ఊళ్లు, ఎంతో సాగుభూమి ముంపునకు గురవడం అనివార్యం. అలా సర్వస్వం కోల్పోయే వారికి ప్రాజెక్టు సాకారమై, ఆ నీటితో బంగారు పంటలు పండే మైదాన ప్రాంతంలోనే కోల్పోయిన భూమికి భూమిని ఇవ్వడమే న్యాయమన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే.. తరతరాలుగా బతికిన ఊళ్లనూ, బువ్వ పెట్టిన భూములనూ వదులుకోవలసి వచ్చిన నిర్వాసితులకు అంత ఆశ లేనేలేదు. న్యాయమైన పరిహారం ఇచ్చి, భూమికి భూమిగా రాళ్ల దిబ్బలను కాక.. నాలుగు విత్తులు జల్లితే నలభై గింజలు పండే కాస్త మంచి భూమినీ ఇస్తే చాలనుకుంటున్నారు. ఆ అల్ప సంతోషాన్ని కలిగించడానికీ సర్కారుకు మనసొప్పడం లేదు. ఈ నేపథ్యంలో నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వాసితులకు న్యాయం జరగాల్సిందేనని, అందరికీ ఒకేరీతిలో పరిహారం ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేసింది. లేకుంటే జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 
     
    సాక్షి, రాజమహేంద్రవరం : 
    పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలని పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం తిర్మానించింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాల్లో సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ, సీపీఎం, బీజేపీ, వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్, రాష్రీ్టయ ప్రజా కాంగ్రెస్, దళిత హక్కులపోరాట సమితి, ఏఐటీయూసీ, ఏఐఎస్, బీకేఎంయూ, పౌరహక్కుల సంఘం, జట్ల లేబర్‌ యూనియన్, విలీన మండలాల లాంచీ యూనియన్, నిర్వాసితుల సంఘాల నేతలు, నిర్వాసితులు మాట్లాడారు. ఏదైనా ప్రాజెక్టుకు భూమి తీసుకుని ఐదేళ్లలో దానిని ఉపయోగించకపోతే రద్దు అవుతుందని చట్టం చెబుతోందని నేతలు పేర్కొన్నారు. 2005లో సేకరించిన భూమి 12 ఏళ్లుగా వినియోగంలో లేదని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2009 నుంచి తీసుకున్న భూములకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అవసరమేనన్న నేతలు, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే వరకూ నిర్మాణం ఆపాలని డిమాండ్‌ చేశారు. నిధులు కేంద్రం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందని, అలాంటప్పుడు పరిహారం ఇవ్వడానికి నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకే ప్రాజెక్టు పరిధిలో ఒక్కో విధంగా పరిహారం ఇస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో ఆయా పార్టీలు, సంఘాల నేతలు, నిర్వాసితులు తమ వాదనను వినిపించారు.
     
    ప్రభుత్వం దిగిరాకపోతే యుద్ధం తప్పదు
    ప్రాజెక్టు పరిధిలో ఐదు లక్షల మంది నిర్వాసితులున్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు వారికి ఇస్తే ప్రాజెక్టు నిర్మాణానికి నిధులెక్కడని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడు. ప్రాజెక్టుకు ఎవరూ వ్యతిరేకం కాదు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే యుద్ధం తప్పదు. జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తాం. పార్లమెంట్‌ ముందు ధర్నా చేస్తాం.
    – కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
     
    చట్టసభల్ని రద్దు చేసి రాజులమని ప్రకటించుకోండి..
    ప్రభుత్వ సంస్థలు పనిచేయడంలేదు. చట్టాలు అమలు చేయాలని ప్రజలు పోరాటాలు చేయాల్సి వస్తోంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు తమకు తాము రాజు, సామంతరాజులుగా ప్రకటించుకోండి. చట్ట సభలు రద్దు చేయండి. ఖర్చు అయినా తగ్గుతుంది. 
    – ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ
     
    ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు
    పోలవరం కుడికాలువ భూసేకరణకు రూ.52 లక్షలు, పట్టిసీమకు రూ.20 లక్షలు ఇచ్చారు. విలీన మండలాల్లో రూ.లక్షపదిహేను వేలు ఇచ్చారు. పరిహారం అడిగితే ఉన్మాదులంటున్నారు. విలీన మండలాల్లో పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు.
    – మిడియం బాబూరావు, మాజీ ఎంపీ
     
     ఎమ్మెల్యేల్ని కొనడానికే పట్టిసీమ
    ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతలు చేపట్టారు.   పాలనను లాభనష్టాలు బేరీజు వేసుకునే వ్యాపారంలా నిర్వహిస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత నీచమైన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదు.                  –జీవీ హర్షకుమార్, మాజీ ఎంపీ
     
    రాష్ట్ర సర్కారు నిధుల్ని మళ్లించకూడదు..
    రైతులు, నిర్వాసితులకు జరిగిన నష్టాన్ని మా పార్టీ గుర్తించింది. నిర్వాసితులకు రూ.40 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు మళ్లించకుండా నిర్వాసితులకే ఇవ్వాలి. కాకినాడ సెజ్‌ను రద్దు చేయాలి. కొత్తగా సేకరించాలి.
    – వై.మాలకొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 
    ఎన్నికల హామీ ఏమైంది?
    2014 ఎన్నికల్లో నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది? పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేంద్రం ఇస్తే రాష్ట్రం ఖర్చు పెడుతోంది. కమీషన్ల కోసం పట్టిసీమ, పురుషోత్తపట్నం అంటూ రూ.నాలుగువేల కోట్లు తగలేస్తున్నారు. అవి నిర్వాసితులకు ఇవ్చొచ్చుకదా?
    – కందుల దుర్గేష్, వైఎస్సార్‌సీపీ నేత 
     
    2013 చట్టం ప్రకారం ఇవ్వాలి
    2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోంది. అలాంటప్పుడు ప్రజలు పోరాటాలు చేయకుండా ఎలా ఉంటారు? నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
    – ఎ¯ŒSవీ శ్రీనివాస్, కాంగ్రెస్‌ నేత 
     
    గ్రామ సభ అనుమతి తీసుకోలేదు
    పీసా చట్టం ప్రకారం గిరిజన గ్రామాల్లో గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. భూములు తీసుకునేటప్పుడు ఈ అనుమతి తీసుకోలేదు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం మిగిలి ఉన్న 10 వేల ఎకరాలకు పరిహారం ఇవ్వాలి. గిరిజన చట్టాలను ప్రభుత్వం తుంగలోతొక్కుతోంది.
    – పల్లా త్రినాథ్, గిరిజన lహక్కుల నేత
     
    ఉద్యోగాలు ఇవ్వాలని వైఎస్‌ తలచారు
    వైఎస్‌ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వారు. నిర్వాసితుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తలచారు. పెద్దగా చదువుకోని వారికి ఐటీఐ శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు వద్ద ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు. ఆయన వెళ్లిపోయాక గిరిజన సమస్యలు మరిచారు.
    – రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే 
    ఎన్నికల ముడిసరుకుగా మారింది
    పోలవరం రాజకీయపార్టీలకు ఎన్నికల్లో ముడిసరుకుగా మారింది. బాధితుల తరఫున ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. హోదా ఇమ్మంటే ప్యాకేజీ ఇచ్చారు. పోలవరాన్ని కూడా ముంచారు. బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. 
    – మేడా శ్రీనివాస్, రాష్రీ్టయ ప్రజా కాంగ్రెస్‌ 
     
    ఆస్పత్రుల్లో నీళ్లు కూడా లేవు 
    విలీన మండలాల్లోని పీహెచ్‌సీల్లో ప్రసవం జరిగే గదిలో కనీసం నీళ్లు కూడా లేవు. ఆయా గ్రామాల్లో కనీస వసతులు లేవు. పునరావాసం కల్పించే వరకూ వసతులు కల్పించాలి. పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపాలి. 
     
    – టి.అరుణ్, సీపీఎం అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు 
     
    చెట్ల కింద ఉంటున్నాం
    మమ్మల్ని సవతి తల్లిలా చూస్తున్నారు. గ్రామం ఖాళీ చేయించారు. ఇళ్లు ఇవ్వలేదు. చెట్ల కింద ఉంటున్నాం. మాకు అన్ని చేశామని అసెంబ్లీ, హైకోర్టుల్లో చెబుతున్నారు. అందరినీ ప్రభుత్వం మోసం చేస్తోంది. 
    – కట్టా కనకదుర్గ, అంగుళూరు, దేవీపట్నం మండలం 
     
    బలవంతంగా ఖాళీ చేయించారు
    అర్ధరాత్రి వచ్చి బలవంతంగా మమ్మల్ని ఖాళీ చేయించారు. ఇద్దె ఇళ్లలో ఉంటున్నాం. ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వలేదు. వారికి పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం. పొలాలు తీసుకున్నారు. పనులు లేవు. 
    – ఇంటి సూర్యకాంతం, అంగుళూరు  
     
    కనీస వసతులు లేవు
    ఇళ్లు కట్టిస్తాం. ప్యాకేజీలు ఇస్తాం అని అధికారులు చెప్పారు. ఇళ్ల వద్ద నీరులేదు. రోడ్లు లేవు. ఎవరైనా చస్తే పూడ్చడానికి శ్మశానాలు లేవు. ఎనిమిదేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. 
    – వరలక్ష్మి, అంగుళూరు 
    జిరాయితీకి రూ.లక్షన్నర మాత్రమే ఇచ్చారు
    రైతుల వద్ద దశాబ్దం కిందట జిరాయితీ భూములు తీసుకుని లక్షన్నర ఇచ్చారు. ఐదేళ్లలో అవి వాడక పోతే రద్దు అయినట్లే. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మళ్లీ సేకరించాలి. పరిహారం ఇవ్వాలి. డీ ఫాం భూములకు 2013 చట్టం ప్రకారం రూ.10 లక్షలు ఇస్తున్నారు. 
    – జె.వి.సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి 
     
మరిన్ని వార్తలు