పోలవరం పనులపై కేంద్ర బృందం అసంతృప్తి!!

18 May, 2016 10:22 IST|Sakshi

పోలవరం:  పోలవరం ప్రాజెక్ట్ పనుల తీరుపై కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం పెదవి విరిచింది. ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నాళ్లు ఇలా చేస్తారని వ్యాఖ్యానించింది. సీడబ్ల్యూసీ రిటైర్డ్ చైర్మన్ ఏబీ పాండే, సీడబ్ల్యూసీ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వైకే హోండా, ఎన్‌హెచ్‌పీసీ రిటైర్డ్ డెరైక్టర్ డీపీ భార్గవ, పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాతో కూడిన కేంద్ర నిపుణుల బృందం రామయ్యపేటలో పోలవరం ప్రాజెక్ట్ పనులను మంగళవారం పరిశీలించింది. హెడ్‌వర్క్స్ ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు పనులు సాగుతున్న తీరును బృం దానికి వివరించారు.
 
 ఈ సందర్భగా విలేకరులతో పాండే మాట్లాడుతూ పోలవరంప్రాజెక్ట్ పనుల తీరును అంచనా వేసేం దుకు తామంతా వచ్చామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం బృహత్తర కార్యక్రమమని, దీనిని అందరి సమష్టి కృషితో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఇక్కడి పనుల్లో నిమగ్నమైన అన్ని సంస్థలు అవగాహనతో పని చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తొలుత ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఏజెన్సీ అతిథి గృహంలో ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ ప్రధాన కాలువలు, భూసేకరణ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో రెండు గంటలపాటు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.
 
 పనుల తీరుపై సమీక్షించారు. ప్రస్తుతం ఏ పనులు జరుగుతున్నాయి, నిర్ణయించిన లక్ష్యం మేరకు చేస్తున్నారా అని ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు సాంకేతిక గ్రాఫ్ ప్రకారం చేస్తున్నారా, లేక ఇక్కడి పరిస్థితిని బట్టి చేస్తున్నారా అని ఆరా తీశారు. తొలుత ప్రాజెక్ట్ నమూనాను నిపుణుల కమిటీ పరిశీలించింది. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పనుల తీరును అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.
 

మరిన్ని వార్తలు