‘గిరి’లో జాతర సందడి

14 Sep, 2016 00:52 IST|Sakshi
‘గిరి’లో జాతర సందడి
 
  •  దేవాదాయశాఖ ఏర్పాట్లు
  • అధికారులతో సమీక్ష నేడు
  • నేటి అర్ధరాత్రి రెండో చాటింపు  
వెంకటగిరి : జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ప్రారంభమైంది. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కల్పించేలా దేవాదాయ ధర్మాదాయశాఖ ఏర్పాట్లును ముమ్మరం చేసింది. ఈ నెల 21,22 తేదీల్లో నిర్వహించనున్న జాతరకు సంబంధించి గత బుధవారం సంప్రదాయబద్ధంగా తొలి చాటింపు నిర్వహించగా బుధవారం అర్ధరాత్రి రెండో చాటింపు వేయనున్నారు. 18వ తేదీన ఘటోత్సవం ప్రారంభం కానుంది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా పోలేరమ్మ దేవస్థానం, నేదరుమల్లి జనార్దన్‌రెడ్డి– రాజ్యలక్ష్మి ప్రగతి కళాతోరణంగా పిలవబడే ఆర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.  జాతరకు వచ్చి అమ్మను దర్శించుకునే భక్తులకు ఎటుంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లకు కార్యాచరణను రూపొందించేందుకు బుధవారం జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జాతరకు హజరయ్యే భక్తుల రద్దీని బట్టి క్యూలైన్ల ఏర్పాటులో ఈ ఏడాది అనుసరించనున్న విధానాలను ఖరారు చేయనున్నారు. వృద్ధులకు, చిన్నారులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్ల క్రితం అప్పటి ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. జాతరలో అమ్మవారి దర్శనం ప్రారంభం కాగానే  పట్టణంలోకి ద్విచక్ర వాహనాలను మినహా ఆటోలు, కారులు ప్రవేశాన్ని నిషేధించడం మంచి ఫలితాలను ఇచ్చింది. అప్పటి నుంచి అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. స్థానిక విశ్వోదయ కళాశాల క్రీడాప్రాంగణం, వీఆర్‌జేసీ ఎదురుగా ఉన్న మైదానంలో పార్కింగ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇక ప్రధానంగా క్యూలైన్ల ఏర్పాటులో మాత్రం ఏటా అధికారులు విఫలం అవుతూనే ఉన్నారు. ఈ ఏడాది అయిన పక్కా కార్యాచరణతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మదర్శన భాగ్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఉత్సవ కమిటీ ఉత్తర్వులు లేవీ 
మరో వారం రోజుల్లో జాతర ప్రారంభం అవతున్నా.. ఇప్పటి వరకు దేవాదాయశాఖ నుంచి పోలేరమ్మ జాతర ఉత్సవ కమిటీ ఉత్తర్వులు స్థానిక అధికారులకు అందలేదు. జాతర ముగిసే 22వ తేదీ వరకు ఉత్సవ కమిటీ అధికారికంగా ఏర్పాట్లును పర్యవేక్షించాల్సి ఉంది. సాధారణంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే దేవస్థానం శాశ్వత కమిటీలో చైర్మన్‌తో పాటు పలువురు సభ్యులను నామినేట్‌ చేస్తారు. అయితే జాతర ఉత్సవ కమిటీలో చైర్మన్‌ గిరీకి స్థానం లేకుండా అందరూ సభ్యులుగానే ఉత్తర్వులు వెలవడనున్నట్లు తెలిసింది. 
శాంతిసంఘం సమావేశం రేపు 
జాతరను విజయవంతంగా నిర్వహించే క్రమంలో స్థానికంగా ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, స్థానికులు ఇచ్చే సలహాలు, సూచనలను తీసుకునేందుకు శాంతి సంఘం సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది గురువారం స్థానిక త్రిపురసుందరి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధ్యక్షతన దేవాదాయశాఖ, పోలీసులు, రెవెన్యూ, అధికారులు అన్ని వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. ఇక అమ్మసేవలోభాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే దాతలు ఈ సమావేశంలో తాము చేపట్టబోయే కార్యక్రమాలను అధికారులకు వివరించనున్నారు. గతంలో వైఫల్యాలను మననం చేసుకోని అవి పునరావృతం కాకుండా పక్కా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు  
 
మరిన్ని వార్తలు