నేటినుంచి 30 వరకు పోలీస్ యాక్టు

7 Apr, 2016 03:26 IST|Sakshi
నేటినుంచి 30 వరకు పోలీస్ యాక్టు

ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతి తప్పనిసరి
ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడి

 వికారాబాద్: గురువారం నుంచి 30 వరకు జిల్లాలో పోలీస్ యాక్టు 30 అమలులో ఉంటుందని ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలీస్ యాక్టు 30 అమలు ప్రకారం బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, దర్నాలు,రోడ్ షోలు తదితర కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి అన్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి 72 గంటల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు.  ప్రజా సంబంధాలు మెరుగుపడేలా అందరూ నడుచుకోవాలని పేర్కొన్నారు. ఏ మతానికైనా సంతోషమే ప్రతీక అని, ప్రతిఒక్కరూ కుల, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి పండగలను జరుపుకోవాలని సూచించారు.

ఏ వర్గం వారైనా ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండగలు చేసుకోవాలని తెలిపారు. ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించరాదని చెప్పారు. ఈనెల  15, 19వ తేదీల్లో జరిగే శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి వేడుకలతో పాటు 22న జరిగే హనుమాన్ శోభయాత్ర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి జిల్లా ప్రజలను కోరారు. వేడుకల్లో అపశ్రుతులు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ.. పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పండగలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చే యాలని సూచించారు. ఆయా ఉత్సవ సమితి నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. ఊరేగింపులో భారీస్థాయి సౌండ్ బాక్సులను వినియోగించరాదని తెలిపారు.

    అదేవిధంగా నిర్వాహకులు వివిధ కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలు తీసుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు ర్యాలీలో పాల్గొనకుండా చూడాలని పోలీసులను అదేశించారు. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే బైండోవర్లు కూడా చేయాలని ఎస్పీ రెమా రాజేశ్వరి సిబ్బందికి సూచించారు. ప్రజలంతా శాంతియుత వాతావరణంలో పండగలు నిర్వహించుకోవాలని తెలిపారు. వివిధ పండగల నేపథ్యంలో ఎస్పీ జిల్లావాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు