అల్లుడి హత్యకు ఏఎస్ఐ 'సుపారీ'

21 Feb, 2016 10:25 IST|Sakshi
అల్లుడి హత్యకు ఏఎస్ఐ 'సుపారీ'

- రౌడీ షీటర్లతో కలిసి ఏఎస్ఐ పన్నాగం
- భగ్నం చేసిన పోలీసులు.. నలుగురి అరెస్టు
 
విజయవాడ:
  కూతురు ప్రేమను జీర్ణించుకోలేకపోయాడు. అల్లుణ్ణి అంతమొందించి మరో పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకు రౌడీషీటర్లకు సుపారీ ఇచ్చి పోలీసులకు దొరికిపోయాడు. అతను కూడా పోలీసు శాఖకు చెందిన వ్యక్తి కావడంతో ఉన్నతాధికారులు విస్మయం చెందారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని నున్న పోలీసు స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్‌ఐ)గా విధులు ఆంబోతుల రామారావు తన అల్లుడు శ్యామ్‌ను హత్య చేసేందుకు రౌడీషీటర్లతో రూ.5 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.1.50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు.
 
వీరు హత్యకు రచన చేయడం పసిగట్టిన సత్యనారాయణపురం పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సత్యనారాయణపురం పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్న రామారావు, కుమార్తె 2014 డిసెంబర్‌లో వన్‌టౌన్ పాడి వీధిలో వెల్డింగ్ పను లు చేసే శ్యామ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప. వీరి పెళ్లి ఇష్టం లేని రామారావు అల్లుడ్ని హతమార్చి కుమార్తెకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రౌడీషీటర్లయిన వాంబే కాలనీకి చెందిన షేక్ ఖాసింను సంప్రదించాడు. అల్లుడిని హత్య చేస్తే రూ.5 లక్షలు ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
 
ఒప్పందంలో భాగంగా రూ.1.50 లక్షలు ఇచ్చాడు. ఖాసిం, కండ్రిక కాలనీకి చెందిన రౌడీషీటర్ షేక్ చాన్‌బాషా, పాయకాపురానికి చెందిన  రౌడీషీటర్ నెలటూరి రవి, వాంబే కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు గంజి శౌరిని కలుపుకున్నాడు. పూటుగా మద్యం తాపించి న తరువాత హత్య చేసి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలనినిర్ణయించారు. పన్నాగంలో భాగంగా నిందితు లు శ్యామ్‌తో  పరిచయం పెంచుకున్నారు. తరుచూ కలిసి మాట్లాడాలనే నెపంతో పిలి పించినప్పటికీ కుదరలేదు.
 
ఈ క్రమంలోనే మద్యం మత్తుకు లోనైన నిందితుల్లో ఒకరు విషయం స్నేహితుల వద్ద ప్రస్తావించాడు. దీం తో పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులపై సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నెలటూరి రవి పరారీలో ఉండగా మిగిలిన వారిని అరెస్టు చేసి న ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. తప్పు చేసిన పక్షంలో పోలీసులైనా ఉపేక్షంచేది లేదని సీఐ చెప్పారు.

మరిన్ని వార్తలు