మండపేట చోరీ కేసును ఛేదించిన పోలీసులు

3 May, 2017 23:21 IST|Sakshi
మండపేట చోరీ కేసును ఛేదించిన పోలీసులు
చోరీ సొత్తు మొత్తం స్వాధీనం 
మండపేట : పట్టణంలో సంచలనం కలిగించిన భారీ చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక మఠం వీధికి చెందిన యువకుడు 20 ఏళ్ల యువకుడు వీవీ వీరేంద్ర ఈ చోరీకి పాల్పడ్డాడు. మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్‌ చౌదరి నివాసంలో సోమవారం అర్ధరాత్రి దుండగుడు చొరబడి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వియ్యంకుడు చినబాబు గదిలోని బీరువాలో ఉంచిన సుమారు రూ.57.55 లక్షల విలువైన సొత్తును చోరీ చేసిన విషయం విదితమే. వారి కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదుపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐదు బృందాలుగా దర్యాఫ్తు ప్రారంభించారు. చోరీకి గురైన వస్తువుల జాబితాతో ముద్రించిన కరపత్రాలను మండపేట, రావులపాలెం, రామచంద్రపురం, భీమవరం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం తదితర ప్రాంతాల్లోని బంగారు వర్తకుల షాపులకు అందజేశారు. 
గతంలో పనిచేసిన అనుభవంతోనే..
చోరీ జరిగిన ఇంటిలో ఈ యువకుడు గతంలో వడ్రంగి పనిచేసినట్టు తెలిసింది. వీరేంద్ర చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. 10వ తరగతి పాసైన తర్వాత పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ చేశాడు. తాతతో కలిసి వడ్రంగి పనిలోకి వెళుతూ, ఎలక్ట్రికల్‌ పనులు కూడా చేస్తుండేవాడు. గతంలో చౌదరి నివాసంలో తాతతో కలిసి పనులు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఒక కంప్యూటర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ ఈ ఏడాది జనవరిలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే విజయవాడలోనే ఉండేవాడని తెలిసింది. సోమవారం రాత్రి మండపేట చేరుకున్న నిందితుడు ఇంటికి వెళ్లే మార్గంలోని చౌదరి ఇంటిలోకి చొరబడ్డాడు. సుజాతమ్మ టాయిలెట్‌కు వెళ్లిన సమయాన్ని గమనించి లోపలికి చొరబడి ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. 
పట్టుబడిందిలా...
కేపీ రోడ్డులోని ఒక బంగారం షాపులో రెండు గాజులు విక్రయించేందుకు నిందితుడు బుధవారం తీసుకువచ్చాడు. పోలీసులు అప్పటికే కరపత్రాలు ఇవ్వడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ మురళీకృష్ణ అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడినుంచి అతని ఇంటికి వెళ్లి అతను ఇంటిలో దాచిన బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్నాయి. పోలీసుల ఇంటరాగేషన్‌లో చోరీ చేసినట్టుగా నిందితుడు అంగీకరించినట్టు తెలిసింది. మొత్తం చోరీ సొత్తు రికవరీ కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చోరీ విషయంలో ఇంకెవరికైనా ప్రమేయం ఉందనే విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 
మరిన్ని వార్తలు