నల్లమల జల్లెడ

27 Oct, 2016 05:04 IST|Sakshi
నల్లమల జల్లెడ

మార్కాపురం : నల్లమల అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ (ఏఓబీ) వద్ద జరిగిన ఎదురుకాల్పుల ఘటన నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమలలో ప్రస్తుతం గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు సరిహద్దు మండలాలుగా ఉన్న పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు ప్రాంతాల్లో సంయుక్తంగా కూంబింగ్ నిర్విహ స్తున్నట్టు సమాచారం. ఏఓబీ వద్ద మల్కన్‌గిరి జిల్లాలో రెండు రోజుల పాటు ఎన్‌కౌంటర్‌లో మొత్తం 28 మంది మావోయిస్టులు మృతి చెందగా వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా అలియాస్ పృధ్వీ ఉన్నాడు. 2006 వరకు ఆర్కే కూడా నల్లమల నుంచే తన కార్యకలాపాలను కొనసాగించాడు.
 
 మావో సానుభూతిపరుల కదలికలపై నిఘా..
 ఇటీవల కాలంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు మండలమైన పుల్లలచెరువు, బొల్లాపల్లి మండలాల్లోని గ్రామాల్లో మావో సానుభూతిపరుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణ జిల్లాల తో పాటు విశాఖపట్నం
 
 
 ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు, కిడ్నాప్‌లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా నల్లమలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ లో ఇటీవల ఎన్‌కౌంటర్ జరగటం, పోలీసుల కూంబింగ్ ఎక్కువగా ఉండటంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానది మీదుగా నల్లమలలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 2014 జూన్ 19న యర్రగొండపాలెం మండలం మురారికుంట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత జానా బాబురావు, కవిత, నాగమణిలు మృతి చెందారు. 2010 మార్చి 12న పుల్లలచెరువు మండలం నరజాముల తండా వద్ద కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. 2006 జూలై 23న యర్రగొండపాలెం మండలం చుక్కలకొండ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అప్పటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు మరో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటనలు రెండు నల్లమలలో జరిగాయి. దీనితో అప్పటి నుంచి మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్నారు.
 
 జిల్లాలో మావోయిస్టుల చరిత్ర, ప్రజా ప్రతినిధులపై కాల్పులు...
 1988లో దగ్గు రాయలింగం హత్యకు నిరసనగా బస్సు దహనంతో జిల్లాలో పీపుల్స్‌వార్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
 
 1989 ఏప్రిల్ 6న కారంచేడులో ప్రస్తుత బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి మామ దగ్గుబాటి చెంచు రామయ్యను హత్య చేశారు.
 
 1991లో పెద్దదోర్నాల ఎంపీపీ కార్యాలయాన్ని పేల్చి వేశారు.
 
 1992 ఆగస్టు 14న పెద్దదోర్నాల మండలం గటవానిపల్లెలో గజవల్లి బాలకోటయ్యను కాల్చి చంపారు.
 
 1995 డిసెంబర్ 1న అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి కాల్చివేత
 1997 ఆగస్టు 24న పెద్దదోర్నాల మండలం వై చెర్లోపల్లె సర్పంచ్ కుమారుడు బట్టు సంజీవరెడ్డి హత్య
 
 2002 సెప్టెంబర్ 18న పెద్దదోర్నాల ఎంపీపీ గంటా కేశవ బ్రహ్మానందరెడ్డి హత్య
 
 2003 జూన్ 11న పెద్దదోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రావిక్రింది సుబ్బరంగయ్య హత్య
 
 2004 ఫిబ్రవరి 11న పెద్దదోర్నాల పీఏసీఎస్ అధ్యక్షులు అల్లు వెంకటేశ్వరరెడ్డిపై కాల్పులు
 
 2004 ఏప్రిల్ 4న సురభేశ్వర కోన దేవస్థానం అధ్యక్షుడు ఎస్.విజయ మోహనరావు హత్య
 
 2005 ఏప్రిల్ 25న అప్పటి పెద్దదోర్నాల ఎంపీపీ అమిరెడ్డి రామిరెడ్డి వాహనంపై కాల్పులు
 
 2005ఏప్రిల్ 27న అప్పటి ఎస్పీ మహేష్ చంద్రలడ్హాపై హత్యాయత్నం
 
 2006అక్టోబర్ 30న గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య సోదరుడి దారుణ హత్య
 
 2006 ఏప్రిల్ 8న అప్పటి కంభం శాసనసభ్యుడు ఉడుముల శ్రీనివాసరెడ్డిపై దాడియత్నం
 ముఖ్యమైన సంఘటనలు..
 
 1993లో వైపాలెం గెస్ట్‌హౌస్ పేల్చివేత
 2001 ఫిబ్రవరిలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి వాకీటాకీ అపహరణ
 2001 మార్చి 21న శ్రీశైలం-సున్నిపెంట పోలీస్‌స్టేషన్ల పేల్చివేత
 2001 జూన్ 3న పుల్లలచెరువు ఏఎసై ్స ప్రశాంతరావు హత్య
 2001 జూన్ 17న యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్ పేల్చివేత
 బాహ్య ప్రపంచంలోకి రాక..
 1980 జనవరి 22న పీపుల్స్ వార్ ఏర్పాటు
 1992 మే 21న అప్పటి ప్రభుత్వం వార్‌పై నిషేధం
 1995 జూలై 15న అప్పటి టీడీపీ ప్రభుత్వం మావోయిస్టులపై మూడు నెలలపాటు నిషేధం ఎత్తివేత
 1996 జూలై 24న ప్రజా భద్రత చట్టం క్రింద పీపుల్స్ వార్‌పై మళ్లీ నిషేధం అమలు
 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆ ఏడాది జూలై 21న నిషేధం ఎత్తివేత
 2004 అక్టోబర్ 11న తొలిసారిగా పీపుల్స్‌వార్ అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి రాక (దోర్నాల మండలం చిన్నారుట్ల నుంచి)
 2004 అక్టోబర్ 21న మళ్లీ అడవిలోకి..
 2004 అక్టోబర్‌లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావం
 2006 ఆగస్టు 17న పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీపై నిషేధం విధింపు
 

మరిన్ని వార్తలు