అమర వీరుల ఆశయాలను సాధిద్దాం

22 Oct, 2016 01:27 IST|Sakshi
అమర వీరుల ఆశయాలను సాధిద్దాం
  •  సంస్మరణ సభలో కలెక్టర్‌ ముత్యాలరాజు
  •  
    నెల్లూరు(క్రై మ్‌): శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు అజారామరమని కలెక్టర్‌ ఆర్‌ ముత్యారాజు కొనియాడారు. వారి ఆశయసాధనకు అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు కవాతు మైదానంలో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించాచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లోని జవాన్లు యుద్ధం వచ్చినప్పుడే పోరాటం చేస్తారన్నారు. పోలీసులు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం పోరాడుతూనే ఉంటారన్నారు. పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సామేనన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ, సమాజ సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ దేశ, సమాజ రక్షణలో అసువులు బాసిన వారి పవిత్ర బలిదానం, త్యాగనిరతి అందరికి స్పూర్తిదాయకమన్నారు. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ సమాజంలో మెరుగైన శాంతిభద్రతలను ప్రజలకు అందించడమే అమరులకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 16 మంది విధి నిర్వహణలో మృతి చెందారనీ, వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.  అనంతరం జిల్లా అదనపు ఎస్పీ బీ శరత్‌బాబు  ఈ ఏడాది విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా మృతిచెందిన అమరవీరుల పేర్లను చదివి వారికి నివాళులర్పించారు. 
    అమర వీరులకు నివాళి
    పోలీసు గ్రౌండ్‌లోని అమర వీరుల స్థూపానికి కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్‌గున్నీ నివాళులర్పించారు.  అలాగే ఏఎస్పీలు బీ శరత్‌బాబు, సూరిబాబు, క్రైం ఓఎస్‌డి విఠలేశ్వర్, డీఎస్పీలు ఎన్‌ కోటారెడ్డి, జీ వెంకటరాముడు, కే తిరుమలేశ్వర్‌రెడ్డి, నమ్మగడ్డ రామారావు, బాలసుందరం, శ్రీనివాసరావు, చెంచురెడ్డి, కే శ్రీనివాసరావు,  ఏపీ పోలీసు అధికారుల సేవా సంఘం అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. 
    బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
    స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో కలెక్టర్, ఎస్పీలు సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. షరతులతో కూడిన కారుణ్య నియామకాలు ఇవ్వాలనీ, చనిపోయిన పోలీసు కుటుంబాలకు తహసీల్దార్‌ కార్యాలయంలో త్వరితగతిన సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, ఇళ్లస్థలాలను కేటాయించాలని పోలీసు అధికారుల సంఘ నాయకులు కలెక్టర్, ఎస్పీలను కోరారు. ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ఎస్పీ సైతం కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కారుణ్యనియామకాలు ఆలస్యమైతే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం   ఎస్పీ బాధిత కుటుంబసభ్యులకు బెనిఫిట్స్‌కు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ,  ఏఎస్పీ, పోలీసు అధికారులు, పోలీసు అసోసియేషన్‌ సభ్యులు భోజనం చేశారు. 
     
     
మరిన్ని వార్తలు