న్యాయం కోరుతున్న పోలీసు భార్య

5 May, 2016 12:38 IST|Sakshi
న్యాయం కోరుతున్న పోలీసు భార్య

►  ఏడాది నుంచి పట్టించుకోని వైనం    
► ఓ ఎమ్మెల్యే గన్‌మన్ నిర్వాకం


కాకినాడ: నాలుగేళ్ల క్రితం తనను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఓ ఎమ్మెల్యే గన్‌మన్.. బిడ్డ పుట్టాక అదనపు కట్నం కోసం పుట్టింట వదిలేశాడని ఆరోపిస్తూ ఓ గిరిజన మహిళ బుధవారం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించింది. పెదమల్లాపురానికి చెందిన బాధితురాలు చింతోజు పద్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అడ్డతీగలకు చెందిన చింతోజు వెంకటరమణతో 2012 ఏప్రిల్ 25న పెద్దల సమక్షంలో పద్మ పెళ్లి జరిగింది. అతడికి రూ.1.10 లక్షల కట్నం, బంగారపు గొలుసు, ఉంగరం, ఆడపడుచుకు లాంఛనాలు, రూ.30 వేల నగదు ఇచ్చారు. ఆరు నెలలు భార్యాభర్తల కాపురం సజావుగా సాగింది.

అనంతరం అదనపు కట్నం కావాలని, ఇల్లు అమ్మి సొమ్ము తెమ్మని ఆమె భర్త, అత్తమామలు వెంకటేశ్వరరావు, లక్ష్మి, ఆడపడుచు ప్రియారాణి, మరిది మల్లికార్జున వేధించారు. గర్భిణిగా ఉన్న ఆమెకు భోజనం పెట్టకుండా, దూషించారు. గదిలో బంధించి వెంకటరమణ బెల్టుతో కొట్టాడు. దీంతో పుట్టిన మగబిడ్డ మూడో రోజే కన్నుమూశాడు. ఓసారి ఆమెపై హత్యాయత్నం కూడా జరిగింది. కాగా ఆమె భర్త వివాహేతర సంబంధాలు నెరపుతూ, ఓసారి సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. గ్రామ పెద్దలు మందలించినా.. వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆమెకు ఆడబిడ్డ పుట్టగా, బాలింతరాలని కూడా చూడకుండా వెంకటరమణ కొట్టేవాడు. ఏడాది క్రితం ఆమెను ఇంటికి పంపేసి, భర్త పట్టించుకోవడం మానేశాడు. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి, అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు