భూ దందాలపై డేగకన్ను!

25 Aug, 2016 23:44 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: భూముల రేట్లు విపరీతంగా పెరగడం, రియల్‌ వ్యాపారంలో భారీ కమీషన్లు అందుతుండడం, తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదన వస్తుండడంతో నగరంలో రియల్‌ వ్యాపారంపై అన్ని వర్గాల వారూ కన్నేశారు. ఈ నేపథ్యంలోనే భూ వివాదాలూ అదే స్థాయిలో పెరిగిపోయాయి. రియల్‌ వ్యాపారం ఇప్పుడ నేరాలకు దారితీస్తోంది. హత్యలు, కిడ్నాప్‌లు, కబ్జాలు సర్వసాధారణమయ్యాయి.

దీంతో రియల్‌ వ్యాపారంపై నిఘా ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. నగరంలో నివసిస్తున్న కొందరు రియల్టర్లు, రాజకీయ నేపథ్యం ఉన్న వారు, వారి ప్రతినిధులు, పొలిటికల్‌ సపోర్ట్‌ ఉన్న వారు అనేక ప్రాంతాల్లో సివిల్‌ సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్నది పోలీసుల అనుమానం.

ఈ క్రమంలోనే బెదిరింపులు, దాడులతో పాటు ఒక్కోసారి హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇవి కొన్నిసార్లు శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగించడంతో పాటు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిణామాలను బేరీజు వేసిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగర వ్యాప్తంగా నమోదవుతున్న, వెలుగులోకి రాకుండా గుట్టగా సాగుతున్న సివిల్‌ వ్యవహారాలతో కూడిన అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఠాణాలకు వచ్చే కేసుల్ని పోలీసులు, తెరపైకి రాకుండా చాపకింద నీరులా ఉండే వాటిని స్పెషల్‌బ్రాంచ్‌ అధికారులు విశ్లేషించనున్నారు.

రెవెన్యూ అధికారుల సాయంతో జాబితాలు...
నగర వ్యాప్తంగా వివాదాస్పద భూములు ఎక్కడ ఉన్నాయి? ఆక్రమణలపై వివాదాలు ఎక్కడ నడుస్తున్నాయి? ఏఏ ప్రాంతాల్లో సివిల్‌ వివాదాలు సున్నితాంశాలుగా మారుతున్నాయి? తదితర అంశాలు పోలీసు విభాగం కంటే రెవెన్యూ అధికారులకే ఎక్కువగా తెలుస్తాయి. మరోపక్క ఇటీవల పలు సందర్భాల్లో రెవెన్యూ అధికారులు భూముల లెక్కలు సైతం తేల్చారు.

నిత్యం భూ సంబంధిత అంశాలు వీరి రికార్డుల్లోనే అప్‌డేట్‌ అవుతుంటాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం అవసరమైన సందర్భాల్లో రెవెన్యూ అధికారుల సహాయం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. కోర్టులు, ఇతర యంత్రాంగాల వద్ద విచారణలో ఉన్న కీలక కేసుల వాయిదాల సందర్భంలో ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

మరిన్ని వార్తలు