రేషన్‌ బియ్యం పట్టివేత

26 Sep, 2016 22:46 IST|Sakshi
రేషన్‌ బియ్యం పట్టివేత


చౌటుప్‌లో 174, నార్కపల్లిలో 175 క్వింటాళ్లు
తిరుమలగిరి నుంచి కర్ణాటకకు రవాణా
పంతంగి టోల్‌ప్లాజా వద్ద చిక్కిన లారీ
చౌటుప్పల్‌ : తిరుమలగిరి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు తరలిస్తున్న రేషన్‌ బియ్యం లారీని చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద సోమవారం ఉదయం జిల్లా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన లారీని చౌటుప్పల్‌లోని సివిల్‌సప్లై గోదాంకు తరలించారు. లారీలో 346 బస్తాల్లో 174.15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉన్నాయి. వీటిని గోదాంలో భద్రపరిచారు. లారీని, పట్టుబడిన డ్రైవర్‌ వెంకటేశ్‌ను చౌటుప్పల్‌ పోలీసులకు అప్పగించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లారీ శ్రీకాళహస్తిలో ధాన్యాన్ని నింపుకుని ఆదివారం ఉదయం మిర్యాలగూడకు వచ్చింది. అక్కడ ధాన్యాన్ని దింపి సూర్యాపేటకు వచ్చింది. లారీ యజమాని డ్రైవర్‌ వెంకటేశ్‌కు ఫోన్‌ చేసి తిరుమలగిరిలో బియ్యాన్ని నింపుకుని కర్ణాటకలోని బంగారుపేటకు వెళ్లమని చెప్పాడు. దీంతో డ్రైవర్‌ లారీని తిరుమలగిరికి తీసుకెళ్లాడు. తిరుమలగిరిలోని సంతోష్‌ రైస్‌మిల్లులో రేషన్‌ బియ్యం బస్తాలను లారీలో నింపారు. సోమవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో లారీ కర్ణాటకకు బయలుదేరింది. 7 గంటల సమయంలో విజిలెన్స్‌ డీఎస్పీ సత్తన్న ఆధ్వర్యంలో చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద లారీని ఆపి పట్టుకున్నారు. పట్టుకున్న లారీని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించగా భువనగిరి ఏఎస్‌వో బ్రహ్మారావు, ఆర్‌ఐ హరిశ్చంద్రారెడ్డి పంచనామా నిర్వహించారు. బియ్యాన్ని గోదాంలో భద్రపరిచారు.
నార్కపల్లిలో మరో లారీ...
రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని విజిలెన్స్‌ అధికారులు నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని వివేరా హోటల్‌ సమీపంలో పట్టుకున్నారు. విజిలెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరిలోని సంతోష్‌ రైస్‌ మిల్లు నుంచి కర్ణాటకలోని బంగారుగడ్డకు రేషన్‌ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం నార్కట్‌పల్లి వద్ద మాటు వేసి పట్టుకున్నట్లు తెలిపారు. లారీలో 350 బస్తాల్లో 175 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో విజిలెన్స్‌ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ సత్తన్న, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, సివిల్‌ సప్లయి అధికారులు డి.టి రంగారావు, ఏఎస్‌ఓ శేషన్న, తహసీల్దార్‌ విజయలక్ష్మి, విజిలెన్స్‌ ఎస్సై గౌస్, కానిస్టేబుల్‌ కొయ్య నర్సింహ్మరెడ్డి, ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్వో కట్ట యాదయ్య పాల్గొన్నారు. 
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా