ఏపీలో ‘ఖాకీ’ కేటుగాళ్లు!

13 Aug, 2015 18:30 IST|Sakshi
ఏపీలో ‘ఖాకీ’ కేటుగాళ్లు!

సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తుంటాం... అయితే, పోలీసులే నేరాలకు పాల్పడుతుంటే..? ఏం చేయాలో తెలియక పునరాలోచనలో పడతాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇలాగే ఉంది. తన కింద పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న గుంటూరు జిల్లా నర్సరావుపేట గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శరత్‌బాబు సస్పెండయ్యారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కేసులో కానిస్టేబుళ్లతోపాటు ఓఎస్డీ స్థాయి అధికారి సమైజాన్‌రావు కటకటాల వెనక్కి వెళ్ళారు.

హత్య కేసులతో మొదలు పెడితే దోపిడీల వరకు ఖాకీ కేటుగాళ్ల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ తరహా నేరాలు చేస్తున్న పోలీసులంతా తమ ట్రైనింగ్ కాలంలో రకరకాల అంశాల్లో శిక్షణ పొందిన వారే. పోలీసుల విచారణ, దర్యాప్తు విధానాలపై వీరికి మంచి పట్టు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చట్టానికి చిక్కకుండా నేరాలు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అయితే మిగిలిన నేరగాళ్ల మాదిరిగానే వీరు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు అసంకల్పితంగానే వెలుగులోకి వస్తున్నాయి.

రాష్ట్రంలో ‘పోలీసు క్రైమ్’ పెరుగుతుండగా... ఉన్నతాధికారులు చేపడుతున్న నామమాత్రపు చర్యలు ఫలితాన్నివ్వడం లేదు. ఏదైనా నేరంలో ఓ అధికారి అరెస్టు అయితే... సస్పెండ్ చేయడమో, చార్జ్‌మెమో ఇవ్వడమో చేసి చేతులు దులుపుకుంటున్నారు. దానివల్ల ఫలితాలు కనిపించడంలేదు.

కొన్ని ఉదంతాలు..
* కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బాంబే జువెలర్స్ గుమాస్తాను బెదిరించి సొమ్ము స్వాహా చేసిన కేసులో కానిస్టేబుళ్లు జయన్న సత్యనారాయణ, శేఖర్
* పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గర్భిణిపై అత్యాచారం చేసిన కేసులో కానిస్టేబుల్ జి.రవి
* నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారం వ్యాపారుల నుంచి రూ. 85 లక్షలు దోచుకున్న కేసులో కానిస్టేబుళ్లతోపాటు ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీ
* కర్నూలు జిల్లా సీఐడీ ఇన్‌స్పెక్టర్ యుగంధర్‌పై భార్యను హత్య చేసిన ఆరోపణలు
* బంగారం వ్యాపారులను బెదిరించి సొత్తు స్వాహా చేసిన కేసులో చిత్తూరు టూ టౌన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుళ్లు రమేష్, మహేష్
* కుటుంబ సమస్య పరిష్కారం కోసం వెళితే కోరిక తీర్చమని వేధిస్తున్నాడని విజయనగరానికి చెందిన ఓ ఎసై్సపై మహిళ ఫిర్యాదు
 

మరిన్ని వార్తలు