ఆరో రోజుకు చేరిన పరీక్షలు

26 Dec, 2016 21:47 IST|Sakshi
కాకినాడ క్రైం : 
పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో భాగంగా కాకినాడ పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ నేతృత్వంలో అభ్యర్థులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో 1,200 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,076 మంది పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు. 1600 మీటర్ల పరుగు పోటీల్లో నాలుగు రౌండ్లు చేరుకునే క్రమంలో ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన అభ్యర్థులకు పోలీస్‌లు సపర్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఏఆర్‌ దామోదర్, ఓఎస్డీ వై.రవిశంకర్‌రెడ్డి, పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.
2 నుంచి అందుబాటులో ఎస్పీ 
పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకంలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు ఈనెల 31వ వరకు జరుగనుండడంతో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండరని ఎస్పీ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో అర్జీలు, ఫిర్యాదులు అందజేయడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఎస్పీ కార్యాలయానికి రావద్దని, జనవరి 2వ తేదీ నుంచి ఎస్పీ ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొంది.
 
మరిన్ని వార్తలు