ఖాకీల కాఠిన్యం

10 Sep, 2016 22:00 IST|Sakshi
ఖాకీల కాఠిన్యం
  • వామపక్షాల ప్రదర్శన ఉద్రిక్తం
  • మలుపులో అడ్డుకున్న పోలీసులు
  • తీవ్ర వాగ్వాదం.. తోపులాటలు
  • ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు
  • పలువురు నాయకులకు స్వల్ప గాయాలు
  • ఒంగోలు టౌన్‌ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు శనివారం ఒంగోలులో నిర్వహించిన ప్రదర్శన  ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక సుందరయ్య భవన్‌ నుంచి ప్రదర్శనగా బయల్దేరిన నాయకులు, కార్యకర్తలను రోడ్డు చివరి మలుపులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాటకు కూడా దారితీసింది. దీంతో పోలీసులు మరింతగా రెచ్చిపోయి ప్రదర్శనకారులను రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఆటోల్లో కుక్కేశారు. ఈ పెనుగులాటలో సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు చేతికి గాయమైంది. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లుతో పాటు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అంతకుముందు ఆర్టీసీ బసుస్టేçÙన్‌లో ఆందోళన చేసేందుకు వెళ్తున్న సీపీఎంకు చెందిన ఏడుగురు, సీపీఐకి చెందిన ఐదుగురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.
    అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు : నాయకులు
    ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అరెస్టులతో ఆపలేరని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు. ఆ పని చేయకుండా హోదా కోసం పోరాడేవారిని అరెస్టులు చేయించడం దుర్మార్గమన్నారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజా నిరసనను, బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమంపై డీజీపీ వైఖరి, జిల్లా పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. జిల్లాలో బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు. ఉద్యమకారులను స్థానికంగా అరెస్టు చేసి పెద్దారవీడు, జరుగుమల్లి, పర్చూరు, కొనకనమిట్ల, ముండ్లమూరు పోలీసుస్టేçÙన్లకు తరలించడాన్ని చూస్తే హోదా విషయంలో కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమ్మక్కైనట్లు స్పష్టమైందన్నారు. ప్రజల ఆగ్రహావేశాలకు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకై ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమంలోకి వచ్చే రోజులు ముందున్నాయన్నారు. ఆ రోజు ఉద్యమాన్ని చంద్రబాబు ఆపలేరన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం నుంచి వచ్చిన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించడం దారుణమన్నారు. చంద్రబాబు నిరంకుశ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కార్యక్రమంలో వామపక్షాల నేతలు చీకటి శ్రీనివాసరావు, గంటెనపల్లి శ్రీనివాసులు, బి.రఘురామ్, కిరణ్, పి.కొండయ్య, అనీల్, వినోద్, జీవీ కొండారెడ్డి, జి.రమేష్, బి.వెంకట్రావు, దామా శ్రీనివాసులు, కె.రమాదేవి, సీహెచ్‌ రమాదేవి, ఆర్‌.శ్రీనివాసరావు, అత్తంటి శ్రీనివాసులు, ఎస్‌డీ హుస్సేన్, కేఎస్‌బాబు, పీవీఆర్‌ చౌదరి, కె.సుబ్బారావు, ఎస్‌డీ సర్దార్, ఎం.వెంకయ్య, నాగేశ్వరరావు, యూ.ప్రకాశరావు, బి.పద్మ, సుపరిపాలన వేదిక నాయకుడు టి.గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు