పోలీసులే లక్ష్యంగా మందుపాతర్లు..

22 May, 2016 04:50 IST|Sakshi
పోలీసులే లక్ష్యంగా మందుపాతర్లు..

చింతూరు : పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతర్లను శనివారం వెలికితీసినట్టు చింతూరు ఓఎస్డీ డాక్టర్ ఫకీరప్ప తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూంబింగ్‌లో భాగంగా పోలీసులు ఏడుగురాళ్లపల్లి సంత ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా రేగులపాడు సమీపంలో రెండు మందుపాతర్లు కనిపించినట్టు తెలిపారు. వెంటనే కాకినాడ నుంచి బాంబ్ డిస్పోజల్ బృందం వెళ్లి కుంట సీఆర్పీఎఫ్‌కు చెందిన బృందం సహాయంతో వాటిని వెలికితీసి నిర్వీర్యం చేసినట్టు తెలిపారు. లభ్యమైన మందుపాతర్లు ఒకటి 10 కేజీలు, మరొకటి 7 కేజీల బరువు కలిగినవని,  శక్తిమంతమైన కార్డెక్స్ వైరు, ఇనుప ముక్కలను మావోయిస్టులు వినియోగించారని ఓఎస్డీ తెలిపారు.

పోలీసుల ఒత్తిడిని తట్టుకోలేని మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు, విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే విలీన మండలాల్లో పోలీసులు పైచేయి సాధించారని  తెలిపారు. తాజా ఘటనలతో సరిహద్దుల్లోని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశామని, పొరుగునే వున్న తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసుల సహకారంతో జాయింట్ ఆపరేషన్ ద్వారా కూంబింగ్‌ను ముమ్మరం చేశామని ఓఎస్డీ తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అద్నాన్ నయీంఅస్మీ, డీఎస్పీ మురళీమోహనరావు, సీఐ దుర్గారావు, ఎస్‌ఐ గజేంద్రకుమార్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు