బాధితుడికి పోలీసుల వేధింపులు

27 Oct, 2015 09:45 IST|Sakshi

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసులు నిందితులను పట్టుకోవాల్సిందిపోయి.. బాధిత రైతును విచారణ పేరుతో వేధిస్తూ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వనందుకు తుళ్లూరు మండలం మల్కాపురం రైతు గద్దె చంద్రశేఖర్కు చెందిన ఐదెకరాల చెరకు తోటను దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం బాధిత రైతు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం మల్కాపురం సందర్శించి చంద్రశేఖర్ చెరకు తోటను పరిశీలించారు. వైఎస్ జగన్ అక్కడ నుంచి వెళ్లగానే రైతు కుటుంబ సభ్యులకు  పోలీసుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.

విచారణకు రావాలని పోలీసులు చంద్రశేఖర్కు కబురంపారు. సోమవారం రాత్రి 12 గంటలకు వరకు తనను పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారని చంద్రశేఖర్ వాపోయారు. ఆ రోజు ఉదయం కూడా పోలీసులు ఫోన్ చేసి విచారణకు రావాలని చెప్పినట్టు వెల్లడించారు. గత మూడు రోజులుగా ప్రతి అరగంటకు తాను ఏం చేసిందీ, ఎక్కడ ఉన్నదీ చెప్పాలని పోలీసులు అడిగారని బాధిత రైతు చెప్పారు. నిందితులను పట్టుకోవాల్సింది పోయి తనను విచారించడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులను సంప్రదించిన అనంతరం పోలీసులను కలుస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు