గిరిజన యువతిపై పోలీస్‌ వేధింపులు

7 May, 2017 00:12 IST|Sakshi
– మానవహక్కుల కమిషన్కు బాధితురాలి ఫిర్యాదు
 
 కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): డోన్‌ పట్టణం శ్రీరామ థియేటర్‌ వద్ద తోపుడు బండిపై వ్యాపారం చేసుకునే గిరిజన మహిళ సుజాత పై పోలీసుల వేధింపులు అధికమయ్యాయి. గత శుక్రవారం రాత్రి రౌండ్స్‌కు వచ్చిన ఓ పోలీసు అధికారి.. గిరిజన మహిళను కులంపేరుతో దూషిస్తూ నానా దుర్భాషలాడటంతో బాధితురాలు, ఆమె భర్త శనివారం విలేకరులకు వివరాలు తెలిపారు.. గత ఏడాది వినాయక చవితి రోజున తోపుడు బండల వ్యాపారుల మధ్య వివాదం చోటుచేసుకొని ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో తమకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాజు అనే వ్యాపారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. అంతేగాకుండా తమను పోలీసులు వేధిస్తుండడంతో గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణతో పాటు,  మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 25వ తేదీన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నేపథ్యంలో వేధింపులు మరింత ఎక్కువవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ విషయమై డోన్‌ టౌన్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాత్రి 10గంటలు దాటినా వ్యాపారం చేస్తుడడం, అదీ వైన్‌షాపుల పక్కనే తోపుడు బండి ఉండడంతో మందలించామన్నారు. ఎవరినీ కులం పేరుతో దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. 
 
మరిన్ని వార్తలు