లాఠీకి పొలిటికల్‌ డ్యూటీ!

30 Jun, 2017 23:53 IST|Sakshi
లాఠీకి పొలిటికల్‌ డ్యూటీ!

ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో ఇంటింటి సర్వే
కులాల వారీగా ఓటర్ల వివరాల సేకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు గుట్టుగా సాగుతున్న సర్వే
రాజకీయ లబ్ధి కోసం పోలీసు శాఖను వినియోగిస్తున్న సర్కారు
అధికార దుర్వినియోగంపై సిబ్బంది ఆగ్రహం


ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉంది. ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో అడ్డగోలుగా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నడూ లేనివిధంగా పోలీసు శాఖ ద్వారా కులాల వారీగా ఓటర్ల సర్వే చేయిస్తోంది. తద్వారా తమకు బలం లేని ప్రాంతంపై పట్టు కోసం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ కార్యకర్తల తరహాలో ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని  వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, అమరావతిబ్యూరో : ‘మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు... మీది ఏ కులం.. అందులో ఏ ఉపకులం...’ ఇదీ వారం రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చాపకింద నీరులా వివరాలు సేకరిస్తున్న తీరు. ఈ సర్వే ప్రభుత్వ గణాంకాల కోసం... పథకాలు వర్తింపజేసేందుకు కాదు... టీడీపీ ప్రభుత్వం తమ రాజకీయ ఎత్తుగడల కోసం చేయిస్తోంది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని, చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో తమను పార్టీ కార్యకర్తల కన్నా హీనంగా వాడుకుంటున్నారని పోలీసులు వాపోతున్నారు.

మా రాజకీయమే.. మీ కర్తవ్యం.. అన్నట్లుగా...
రాజకీయ అవసరాల కోసం కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ భావించింది. సాధారణంగా ప్రభుత్వం వద్ద ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాలు మినహా మిగిలిన ఓటర్ల వివరాలు కులాల వారీగా అధికారికంగా ఉండవు. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ సాధికారిక సర్వే కూడా పకడ్బందీగా చేయకపోవడంతో సమగ్ర వివరాలు లేవని టీడీపీ అధిష్టానం భావించింది. దీంతో కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించాలని నిర్ణయించింది. అందుకు ఆ పార్టీ యంత్రాంగాన్ని నియోగిస్తే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ, కీలకమైన పోలీసు శాఖకు ఆ బాధ్యతలు అప్పగించడం విస్మయపరుస్తోంది.

పోలీసు శాఖ ఆ విధులను ఇంటెలిజెన్స్‌ విభాగానికి కేటాయించింది. శాంతిభద్రతలు, సున్నితమైన రాజకీయ అంశాలను ఇంటెలిజెన్స్‌ విభాగం తరచూ సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది. ఎన్నడూ ఇలా పోలీంగ్‌ బూత్‌లు, డివిజన్ల వారీగా వివిధ కులాల ఆధారంగా ఓటర్ల వివరాలను సేకరించేందుకు ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని రంగంలోకి దించలేదు. అయితే, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసింది. తమకు అమరావతి జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు కులాలవారీగా కావాలని ఇంటెలిజెన్స్‌ విభాగానికి మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది.

వారం రోజులుగా సర్వే..!
ప్రభుత్వ ఆదేశాల మేరకు వారంరోజుల కిందట ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు ఓ సమావేశం నిర్వహించి కానిస్టేబుళ్లకు కర్తవ్యబోధ చేశారు. వారికి నియోజకవర్గాలు, డివిజన్లు, మండలాలు పోలింగ్‌ బూత్‌లవారీగా జాబితా ఇచ్చారు. ఎవరు ఏ డోర్‌ నంబర్‌ నుంచి ఏ డోర్‌ నంబర్‌ వరకు ఎవరు సర్వే చేయాలో కూడా నిర్దేశించారు. మొదట డివిజన్‌ కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్‌ అధ్యక్షుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని చెప్పారు. అనంతరం ప్రతి ఇంటికి కూడా వెళ్లి ఓటర్ల వివరాలు కులాల వారీగా సేకరించాలని ఆదేశించారు. ఉప కులాల పేర్లతో సహా రాసుకుని రావాలని చెప్పారు.

ఈ మేరకు కానిస్టేబుళ్లు వారం రోజులుగా రోడ్లపై పడ్డారు. అయితే, కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్‌ అధ్యక్షులు వద్ద కూడా కులాలు, ఉప కులాల వారీగా ఓటర్ల వివరాలు సమగ్రంగా లేవు. ప్రస్తుతం ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తమను పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా వాడుకుంటున్నారని పలువురు ఇంటెలిజెన్స్‌ సిబ్బంది వాపోతున్నారు. అయినా వారి గోడును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

అనుకూల మార్పుల కోసమేనా...!
జూలై ఒకటో తేదీ నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఎక్కడైనా తమకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనిపిస్తే... మిగిలిన మూడు వారాల్లో తమ సానుభూతిపరులు, కార్యకర్తలను ఆయా పోలింగ్‌ బూత్‌లలో ఓటర్లుగా చేర్పించాలని భావిస్తున్నట్లు సమచారం.

మరిన్ని వార్తలు