హత్యా? ఆత్మహత్యా?

5 Nov, 2015 03:34 IST|Sakshi
హత్యా? ఆత్మహత్యా?

సారిక, ముగ్గురు పిల్లల మృతిపై అనేక అనుమానాలు
వరంగల్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యా? ఆత్మహత్యా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సారికను హత్య చేసేందుకే గ్యాస్ లీక్ చేసి అగ్నిప్రమాదం సృష్టించారని ఆమె కుటుంబీకులు, మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్యాస్ లీక్ చేసుకుని సారికే ఆత్మహత్యకు పాల్పడిందని రాజయ్య కుటుంబీకులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు స్థానిక ఫోరెన్సిక్ నిపుణులతోపాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు.
 
అనుమానాలు రేకెతిస్తున్న అంశాలివే..
అగ్ని ప్రమాదానికి కారణమైన రెండు గ్యాస్ సిలిండర్లు వంటగదిలో కాకుండా బెడ్‌రూంలో ఎందుకు ఉంటాయనేది ప్రధాన అనుమానం. సిలిండర్‌లోని గ్యాస్‌ను లీక్ చేయాలంటే రెగ్యులేటర్ ఉంటేనే సాధ్యపడుతుంది. కానీ రెగ్యులేటర్లు వంట గదిలోనే ఉన్నాయి. బెడ్‌రూంకు తీసుకొచ్చిన సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ చేయాలంటే ఎంతో బలం ఉపయోగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సారిక చనిపోయిన గదిలో లైట్, స్విచ్చ్ దగ్గర కాలిపోయినట్లు నల్ల మరకలు ఉండడం కూడా అనుమానం కలిగిస్తోంది. గ్యాస్‌ను ఎవరైనా బయట నుంచి గది లోపలికి వదిలితే.. వాసన వచ్చి లైటు వేయగా ప్రమాదం జరిగి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నిక ఉన్నందున రాజయ్య కుటుంబం ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండదని ఆయన అనుచరులు చెబతున్నారు. వీటన్నింటికీ ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ద్వారానే ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
 
పిల్లల స్కూలు ఫీజులు కూడా చెల్లించలేని స్థితి!
రాజయ్య ఇంట్లో మంగళవారం రాత్రి సారిక, ఆమె భర్త అనిల్ మధ్య గొడవ జరిగినట్లు స్థానిక మహిళలు తెలిపారు. ‘రేపు మీ సంగతి తేలుస్తా..’ అని సారిక రాత్రి సమయంలో అన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలే ఘటనకు దారి తీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవనభృతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అనిల్ పట్టించుకోలేదని, సారిక తరచుగా తమతో బాధలు చెప్పుకునేదని స్థానికులు తెలిపారు. ఫీజులు కూడా చెల్లించకపోవడంతో స్కూల్ నుంచి పిల్లల్ని పంపించారని ఇటీవల ఆమె వాపోయినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు