పోలీసు సిబ్బందికి పుష్కరపాట్లు

4 Aug, 2016 23:17 IST|Sakshi
పోలీసు సిబ్బందికి పుష్కరపాట్లు
  • కనీస సౌకర్యాలు లేవు
  • ఎండా, వానల్లో విధుల నిర్వహణ
  • పొంతనలేని డ్యూటీలు
  • రాజమహేంద్రవరం క్రైం:
     
    అంత్య పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ నియంత్రణ, ఘాట్లలో పహారా, ఘాట్లకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 2,800 మంది పోలీస్‌ సిబ్బంది వచ్చారు.  వీరికి కేటాయించిన సత్రాలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో కనీస సౌకర్యాలను కల్పించడంలో మున్సిపల్‌ అధికారులు విఫలమయ్యారని పోలీసులు పేర్కొంటున్నారు. డ్యూటీలకు పొంతన ఉండడం లేదని, తాము ఉండే షెల్టర్‌కు కనీసం రెండు నుంచి మూడు కి.మీ. దూరంలో విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా షెల్టర్‌కు చేరుకుంటే తాగేందుకు, స్నానం చేసేందుకు నీరు ఉండడం లేదని వాపోయారు. కొన్ని కమ్యూనిటీ హాళ్లలో అపరి శుభ్రమైన వాతావరణం ఉండడంతో దోమలు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాళ్లలో మరుగుదొడ్డి వసతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఏ, డీఏలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని, తమకు కనీస సౌకర్యలు కల్పించకపోవడం దారుణమంటున్నారు. ఇప్పటికే ఐదు  రోజులు పూర్తి అయ్యాయని, భక్తులు అంతగా లేని ఘాట్లలో అవసరం అయిన పోలీస్‌ సిబ్బందిని నియమించాలని, అదనంగా ఉన్న పోలీస్‌ సిబ్బందిని తమ పోలీస్‌ స్టేషన్లకు పంపించేస్తే ఇబ్బందులు తగ్గుతాయంటున్నారు. 
    కృష్ణా పుష్కరాలకు వెయ్యిమంది పోలీస్‌ సిబ్బంది 
    అంత్య పుష్కరాలకు వినియోగించే పోలీస్‌ సిబ్బందిని కృష్ణా పుష్కరాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన అంత్య పుష్కరాలలో పాల్గొనేందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తి అయిన వెంటనే 11వ తేదీ రాత్రి కృష్ణా పుష్కరాలకు వెయ్యి మంది పోలీసులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముందుగా ఏర్పాట్లు చూసేందుకు ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 20 మంది యాంటీ ఎలిమినేట్స్‌ స్క్వాడ్‌లు కృష్ణా పుష్కరాలకు తరలించారు. 
    భక్తుల రక్షణే ముఖ్యం 
    భక్తులు లేరని పోలీస్‌ సిబ్బందిని తగ్గించడం సాధ్యం కాదు. పోలీస్‌ శాఖ అన్ని శాఖల కంటే భిన్నమైంది. యాత్రికులు లేరని ఘాట్లలో పోలీస్‌  భద్రత తగ్గించలేము. ఘాట్లలో భక్తులు సౌకర్యంగా స్నానం అచరించి తిరిగి వెళ్లేలా చేయడంతో పాటు ఘాట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీస్‌ శాఖపై  ఉంది. భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా పోలీస్‌లను భద్రత కోసం వినియోగించాల్సిందే. భక్తులు, యాత్రికుల సేప్టీ,  సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. 
    –ఎం. రామకృష్ణ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ
     
మరిన్ని వార్తలు