ఖాకీల కాసుల దందా

10 May, 2017 23:15 IST|Sakshi

వివాదాస్పదమవుతున్న పోలీసుల తీరు
- పంచాయితీలపైనే మక్కువ ఎక్కువ
- న్యాయపోరాటంలో బాధితులు
- వరుసగా వీఆర్‌కు వెళ్తున్న పలువురు అధికారులు

     అనంతపురం నాల్గో పట్టణ సీఐ శివశంకర్‌ వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరుని ఒత్తిళ్లకు తలొగ్గి రూ.11 కోట్ల విలువజేసే భూ వివాదంలో తలదూర్చారనే అరోపణలు ఎదుర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల చర్యకు బలయ్యారు.  పెనుకొండ సీఐ వెంకటేశ్వర్లు సైతం ఓ కేసు దర్యాప్తులో ఒత్తిళ్లకు తలొగ్గి అలసత్వం వహించారు. విషయం డీఐజీ దృష్టికి పోవడంతో క్రమశిక్షణ చర్యల కింద బదిలీ వేటు వేశారు. ఈ రెండు ఉదాహరణలు చాలు.. జిల్లాలో పోలీస్‌ శాఖ తీరు ఎలా ఉందో చెప్పటానికి. కొందరు పోలీస్‌ అధికారులు సంబంధం లేని కేసుల్లో తలదూర్చుతున్నారు. వారిని చూసి కింది స్థాయి పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు. ఫలితంగా అవినీతి ఆరోపణలపై 25 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ రాజశేఖరబాబు బదిలీ చేయడం విశేషం.

అనంతపురం సెంట్రల్‌ : బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీస్‌ అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. అధికార, ధన బలం కలిగిన వారి కొమ్ముకాస్తున్నారు. అనసవర విషయాల్లో మధ్యవర్తిత్వం వహించి రూ.లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పంచాయితీలు బెడిసికొట్టడంతో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. అయితే బయటకు పొక్కుతున్నవి అరకొర మాత్రమే. గుట్టుగా సెటిల్‌మెంట్స్‌ చేస్తూ భారీగా పోగేసుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  

సివిల్‌ పంచాయితీలపై శ్రద్ధ
అనంతపురం సహా జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో సివిల్‌ పంచాయితీలు బాగానే చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో అయితే ఓ రెండు స్టేషన్‌లో ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. నాల్గో పట్టణ స్టేషన్‌లో బెంగళూరు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఆస్తులను బలవంతంగా పోలీసులే అధికార పార్టీ నేత పేరుతో రాయించేందుకు యత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో సీఐ శివశంకర్‌ వీఆర్‌కు, ఏఎస్‌ఐ రమణ సస్పెన్షన్‌కు గురయ్యారు. కేవలం ఈ స్టేషన్‌లోనే కాదు.. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లోనూ ఈ తరహా సివిల్‌ పంచాయితీలు అధికంగా జరుగుతున్నాయి. ఓ అధికారి ఆరు నెలలుగా సివిల్‌ పంచాయతీలతోనే కాలం నెట్టుకువస్తున్నారు. ఎలాగైనా తనకు అనుకూలమైన వ్యక్తుల పేరుతో రాయించాలని పట్టుబడుతున్నారు. పలుమార్లు స్వయంగా ఆయనే రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కేవలం సీఐలు, ఎస్‌ఐలు మాత్రమే కాదు. కొన్ని స్టేషన్లలో కిందిస్థాయి సిబ్బంది కూడా ఇదే పంథా అవలంబిస్తున్నారు. ఉన్నప్పుడే నాలుగు కాసులు వెనుకేసుకోవాలనే ఉద్దేశంతో నిత్యం పంచాయితీల్లో తలమునకలవుతున్నారు. ఇటీవల జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు ఒకేసారి 25 మంది కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీవేటు వేశారు. వీరిలో మెజార్జి సిబ్బంది అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే.

ముఖ్యమైనవి ‘చినబాస్‌’ వద్దే..
జిల్లాలో పలు స్టేషన్లలో ముఖ్యమైన పంచాయితీలు ఓ చిన్నబాసు వద్ద చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిత్యం పంచాయితీల్లో సదరు అధికారి బిజిబిజీగా గడుపుతున్నారు. ఓ సీఐ ఉన్నప్పుడు కేవలం జిల్లావే కాకుండా ఇతర ప్రాంతాల పంచాయితీల కూడా సదరు అధికారి వద్దకు పంపేవారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన్ను కాపాడుకోవడానికి చివరి క్షణం వరకూ విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కానీ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు మాత్రం ఉపేక్షించలేదు. ఆయనపై చర్యలు తీసుకొని సాగనంపారు. చిన్నబాసు చుట్టూ పంచాయితీల్లో ఆరితేరిన అధికారులనే కోటరీగా నియమించుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనేక ముఖ్యమైన కేసులు గుట్టుచప్పుడు కాకుండా క్లోజ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల బెట్టింగ్‌రాయళ్లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం, అధికారికంగా చూపిన మొత్తంలో భారీగా తేడాలున్నాయనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

క్రమశిక్షణ తప్పితే సహించేది లేదు
పోలీస్‌ శాఖలో పని చేసే వారు ఎవరైనా సరే.. ఏ స్థాయిలో ఉన్నా బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాలి. విచారణ పేరుతో అలసత్వం వహించినా, ఇన్వెస్టిగేషన్‌ సరిగా చేయకపోయినా.. దుప్పటి పంచాయితీలు చేసినా.. సివిల్‌ కేసుల్లో తలదూర్చినా ఉపేక్షించేది లేదు. ఇప్పటికే వివిధ రకాల ఆరోపణలపై 25 మంది కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. ఇది ఇంతటితో ఆగదు. పోలీస్‌ శాఖ పరువు తీసే ఏ ఒక్కరినీ క్షమించేది లేదు.
- ఎస్‌.వి.రాజశేఖరబాబు, ఎస్పీ, అనంతపురం

మరిన్ని వార్తలు