అదిరిపోయే రీతిలో పోలీస్ టవర్స్

17 Jul, 2016 23:45 IST|Sakshi
అదిరిపోయే రీతిలో పోలీస్ టవర్స్

ట్విన్‌ టవర్స్‌ పనుల్లో కదలిక...
ఎర్త్‌వర్క్‌ కాంట్రాక్టు అప్పగింత పనులు పూర్తి
ప్రతి 21 రోజులకు ఓ శ్లాబ్‌ పడేలా ప్రణాళిక
20 అంతస్తులు...83.4 మీటర్ల ఎత్తుతో ఐసీసీసీ
అత్యాధునిక హంగులతో నిర్మాణం
గరిష్టంగా రెండేళ్ళల్లో పూర్తి!

సాక్షి, సిటీబ్యూరో:  ‘ట్విన్‌ టవర్స్‌’ పేరుతో నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మించనున్న సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌–క్వార్టర్స్, ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్‌ ఐసీసీసీ) నిర్మాణం పనులు వచ్చే వారం ప్రారంభంకానున్నాయి. ప్రాథమికంగా రాళ్ళ తొలగింపు, భూమి చదును తదితర ఎర్త్‌వర్క్స్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దీని నిర్మాణానికి సివిల్‌ ఏవియేషన్, మున్సిపల్‌ శాఖల నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో గరిష్టంగా రెండు నెలల్లో భవన నిర్మాణానికీ శ్రీకారం చుట్టనున్నారు. రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ ట్విన్‌ టవర్స్‌ నగరంలోనే అతి ఎల్తైన భవనంగా రికార్డులకు ఎక్కనుంది. నిర్ణీత కాలంలో, ప్రణాళికా బద్ధంగా, అందరికీ ఉపయుక్తంగా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు.
 

83.4 మీటర్లకు పరిమితం...
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఏడెకరాల సంస్థలో ఈ జంట భవనాలను 135 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తొలుత భావించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం బంజారాహిల్స్‌ ప్రాంతంలో 15 మీటర్లకు మించిన ఎత్తులో భవనాల నిర్మాణాలు జరపకుండా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఆంక్షలను సడలిస్తూ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవనానికి ఆ శాఖ అనుమతిచ్చింది. మరోపక్క ఇంత ఎల్తైన భవనాలు నిర్మించాలంటే దానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నగర పోలీసులు ఆ శాఖకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 83.4 మీటర్ల ఎత్తు నిర్మించుకోవడానికి సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అనుమతించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసు విభాగం 20 అంతస్తులతో 83.4 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి సమాయత్తమైంది.
 

ఎర్త్‌వర్క్‌ను వేరుచేసి వేగంగా...
ఈ ట్విన్‌ టవర్స్‌ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఆహ్వానించడం, వాటిని పరిశీలించడం, కాంట్రాక్టు అప్పగించడం తదితర వ్యవహారాలన్నింటినీ రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ భవనాల నిర్మాణాలు చేపట్టడానికి గరిష్టంగా రెండు నెలల కాలం పట్టే అవకాశం ఉంది. అప్పుడైనా తొలుత భూమి చదునుకు సంబంధించిన పనులతో ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాలయాపన జరుగకుండా ఎర్త్‌ వర్క్‌ను వేరుచేసి, మరో టెండర్‌ను ఆహ్వానించారు. దీన్ని ఓ ప్రైవేట్‌ సంస్థ దక్కించుకోవడంతో వచ్చే వారం పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఆ స్థలంలో ఉన్న రాళ్ళ తొలగింపు, నేల చదును చేయడం తదితర పనుల్ని పూర్తి చేసే ఈ సంస్థ నిర్ణీత కాలంలో పోలీసు విభాగానికి అప్పగిస్తుంది. ఈ లోపు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్లు, ఇతర ప్రక్రియలు పూర్తి కావడంతో తక్షణం నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది.
 

ప్రతి 21 రోజులకు ఒక శ్లాబ్‌...
లండన్, న్యూయార్క్‌ తరహాలో ఉత్తమంగా తయారయ్యే ఈ ఐసీసీసీ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి గరిష్టంగా రెండేళ్ళల్లో పూర్తి చేయించడానికి పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని నిర్మించనున్నారు. ఆద్యంతం ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రతి 21 రోజులకు ఒక స్లాబ్‌ చొప్పున పూర్తి చేస్తూ గరిష్టంగా రెండేళ్ళ కాలంలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ.1002 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 

అధునాత హంగులు...
  ♦   ఈ ఐసీసీసీని పూర్తిస్థాయిలో డబుల్‌ ఇన్సులేటెడ్‌ గ్లాస్‌తో నిర్మించనున్నారు.

 ♦   టవర్స్‌లో ఉండే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్యానెల్స్‌ అదనపు ఆకర్షణ.

 ♦   భవనం పైన హెలీప్యాడ్, భవనంలో పబ్లిక్‌ అబ్జర్వేషన్‌ డెస్క్, పోలీసు మ్యూజియం.

 ♦  900 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్‌ వసతి.

 ♦  పోలీసు శాఖకు చెందిన అన్ని విభాగాలూ ఒకే చోటకు..

 ♦  కేవలం నగర పోలీసులకే కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఇందులో భాగస్వామ్యం.

 ♦  భవనం 18వ అంతస్తులో నగర పోలీసు కమిషనర్‌ అధికారిక కార్యాలయం ఏర్పాటు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా