అసహనం, ఆంక్షలు అణచివేత

22 Jul, 2016 00:27 IST|Sakshi
అసహనం, ఆంక్షలు అణచివేత
 ఏ వర్గం ఎలుగెత్తినా ఇదే సర్కారు తీరు
 కాపు ఉద్యమం నాటి నుంచీ ఖాకీ రాజ్యం
 హోం మంత్రి ఇలాకాలో మరింత జులుం
 రైతుల రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఆటంకం
అమలాపురం :
అసహనం హద్దు మీరుతోంది. అధికారం నిరంకుశత్వంగా మారుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని ఏ వర్గం వారు ఉద్యమించినా, నిరసన ప్రదర్శన నిర్వహించినా, చివరకు సమావేశాలు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఖాకీల అండతో ఉక్కుపాదంతో అణ చివేయాలనుకుంటోంది. పోలీసులు సైతం రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారు. వీరి వ్యవహారశైలితో 
తాము విమర్శల పాలవుతున్నామనే స్పృహ కూడా పాలకులకు కొరవడుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ అమలాపురంలో రైతులు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తే జులుం చూపి అడ్డుకోవాలనుకోవడం.
కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపట్టిన నాటి నుంచి జిల్లాలో పోలీసుల అణ చివేత పర్వం ఆరంభమైంది. తుని ఘటనలో నిందితుల అరెస్టు, అనంతరం ముద్రగడ దీక్ష చేపట్టిన నాటి నుంచి కోనసీమ పోలీసు రాజ్యంగా మారిపోయింది. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను దింపి బలప్రయోగానికి దిగింది. అమలాపురంలో ఉద్యమాన్ని అణ చివేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావించింది. పైగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పది అమలాపురం కావడంతో ఇక్కడ ఉద్యమం అనేది లేకుండా చేయాలని పోలీసులకు అపరిమితమైన అధికారాలు అప్పగించింది. ఇక్కడ నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడం, కాపు ఉద్యమ నేతల గృహనిర్బంధం వంటి నిరంకుశ విధానాలను అనుసరించింది. ఆ తరువాత కూడా ఇక్కడ జరుగుతున్న అన్నిరకాల నిరసనలు, ఉద్యమాలను పోలీసు బలంతోనే అణ చివేయాలని చూస్తోంది. రైతు ఉద్యమాల విషయంలో ఇదే పంథాను అమలు చేస్తోంది.
చర్చలకు పిలిచి హెచ్చరించిన హోం మంత్రి
ఖరీఫ్‌ గిట్టుబాటు కావడం లేదని ఇటీవల కోనసీమ రైతులు స్వచ్ఛంద పంట విరామ ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తొలుత కేసులు పెడతామని బెదిరింపులకు దిగింది. తమ సమస్యల్ని పరిష్కరించకుంటే పంట విరామంపై ఆలోచన చేయాల్సి ఉంటుందని రైతు సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. గత జూన్‌ 30న అమలాపురంలో బహిరంగ సభ నిర్వహిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు ప్రకటించగా, ముద్రగడ దీక్ష సమయంలో మొదలైన 144, 30 సెక్షన్‌లను పొడిగించి అడ్డుకున్నారు. రైతులను చర్చల పేరుతో పిలిచి ‘పంట విరామం చేస్తే చూస్తూ ఊరుకోం’ అని హోంమంత్రి రాజప్ప హెచ్చరించారు. రైతులు తమ సమస్యల పరిష్కారంపై అమలాపురం శివారు జనహిత కార్యాలయంలో గతనెల 30న సమావేశం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా గురువారం అదే జనహిత కార్యాలయంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేయడంపై బీకేఎస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్‌–30ని సాకుగా చూపించి సమావేశాన్ని అడ్డుకోవడమే కాక బీజేపీ నాయకుడు ఆర్‌.వి.నాయుడు మాట్లాడుతుండగా పట్టణ ఎస్సై కె.విజయశంకర్‌ మైక్‌లాక్కుని విరగ్గొట్టారు. దీనిపై రైతులు మండిపడ్డారు. ‘హోంమంత్రి సొంతప్రాంతమని ఇక్కడ ఏడాది పొడవునా సెక్షన్‌–30ని అమలు చేస్తారా?’ అని రైతులు పోలీసులను నిలదీశారు. సమావేశానికి వచ్చిన వివిధ పార్టీల వారే కాదు.. అధికార టీడీపీ, మిత్రపక్ష బీజేపీ నాయకులు సైతం పోలీసు తీరును తప్పుపట్టడం గమనార్హం. ‘రైతుల మీద ఇదెక్కడ జులుం?’ అని ప్రశ్నిస్తున్నారు. రైతులను రెచ్చగొట్టే తీరును మార్చుకోకుంటే 2011 నాటి సాగుసమ్మె నాటి పరిణామాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వార్తలు