మారిన రాజకీయం

1 Jun, 2016 11:44 IST|Sakshi

జిల్లాలో.. రెండేళ్లలో ఎన్నో పరిణామాలు
 ఇతర పార్టీల నుంచి వలసలు
 ఎన్నికల్లో  విజయాలతో గులాబీ దళంలో ఉత్సాహం
 ఎమ్మెల్సీ విజయం
 మినహా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరం
 బిగ్‌షాట్స్ ఉన్నా ట్రబుల్‌లోనే ‘హస్తం’ పార్టీ
 కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కమలనాథుల్లో గుబులే
 యథారాజా స్థితిలో కమ్యూనిస్టులు
 బలోపేతం కోసం వైఎస్సార్ సీపీ యత్నాలు
 ఉనికి  కోసం ‘తమ్ముళ్ల’ పాట్లు

 
 అప్పుడే రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు అయిపోతోంది. చైతన్యానికి మారుపేరుగా నిలిచిన జిల్లాలో ఈ రెండేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు సంభవించాయి. అధికారం తెచ్చిన ఊపును తొలి ఏడాదితో పాటు రెండో ఏడాదిలోనూ కొనసాగించిన టీఆర్‌ఎస్ జిల్లా రాజకీయాల్లో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
 
 జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోదాదాపు జిల్లాలోని అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు వెల్లువెత్తాయి. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూల  రవీందర్‌తో పాటు వివిధ పార్టీల నేతలు తేరాచిన్నపరెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి, వేనేపల్లి చందర్ రావు, గుత్తా జితేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు తదితరులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

 
 (సాక్షి ప్రతినిధి, నల్లగొండ)
 అప్పుడే రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు అయిపోతోంది. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచిన జిల్లాలో ఈ రెండేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు సంభవించాయి. అధికారం తెచ్చిన ఊపును తొలి ఏడాదితో పాటు రెండో ఏడాదిలోనూ కొనసాగించిన టీఆర్‌ఎస్ జిల్లా రాజకీయాల్లో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సంపాదించగా, మొన్నటి వరకు జిల్లాలో కింగ్‌మేకర్స్‌గా ఉన్న కాంగ్రెస్ నేతలు కుదేలయిపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో సగం అసెంబ్లీ సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులు ఆ విజయాలతో సరిపెట్టుకుని ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. బిగ్‌షాట్స్ ఉన్నా జిల్లాలో హస్తం పార్టీ ఇంకా ట్రబుల్స్‌లోనే ఉండిపోయింది.
 
 కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన బీజేపీ మాత్రం జిల్లాలో ఇంకా సంస్థాగత నిర్మాణం విషయంలో బుడిబుడి అడుగులు వేసే దశలోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని చెపుతున్న కమలనాథులకు జిల్లా రాజకీయాలు గుబులునే మిగుల్చుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కష్టపడాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జిల్లాకు చెందిన డాక్టర్. గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులు కావడంతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. ఇక, ఒకప్పుడు జిల్లాలో ‘కీ’లక పాత్ర పోషించిన కమ్యూనిస్టులు తెలంగాణ ఉద్యమం.. తదనంతర పరిణామాల్లో బలోపేతం కోసం శ్రమించే పనిలో కమ్యూనిస్టులు ఉండగా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పూర్తిస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లా తెలుగు తమ్ముళ్లు ఉనికిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గత రెండేళ్ల కాలంలో జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాలు, వివిధపార్టీల పరిస్థితులపై ప్రత్యేక కథనం...
 
 ఉనికి కోసం తమ్ముళ్ల పాట్లు
 ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లాలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ పెద్ద ఎత్తున కేడర్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలున్నారు.  పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పెద్ద ఎత్తున ఉండ డంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడింది. అయితే, ఇటీవల నిర్వహించిన మినీ మహానాడు సక్సెస్ కావడంతో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే ఆశ ఆ పార్టీ నేతల్లో పిసరంతా ఉన్నా అది ఆచరణలోనికి రావడం అంత సులభమైనది కాదని రాజకీయ వర్గాలంటున్నాయి.
 
 ముఖ్యంగా పార్టీని జిల్లాలో నడిపించాల్సిన నేతల మధ్య కుమ్ములాటలతో పాటు ఆ పార్టీని ఆదరించాలన్న ఆలోచన ప్రజల్లో కనిపించకపోవడంతో రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో కూడా తెలుగుతమ్ముళ్లకు అంతు పట్టడం లేదు. పూర్తిగా అంతర్మథనంలో ఉన్న ఆ పార్టీకి ఈ రెండేళ్లలో టీఆర్‌ఎస్ షాక్ మీద షాక్ ఇవ్వగా, ఒకటి, రెండు సందర్భాల్లో సొంత పార్టీ నేతల వైఖరి వల్ల కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఊహించలేమని, జిల్లాలో మళ్లీ పుంజుకోవాలంటే చాలా సమయమే పడుతుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
 
 కమలనాథుల కథ అంతేనా?
 కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన పార్టీగా భారతీయ జనతా పార్టీ జిల్లాలో గత రెండేళ్లలో చెప్పుకోదగిన ఫలితాలేవీ సాధించలేదు. నరేంద్రమోదీ హవాతో కేంద్రంలో అధికారం చేపట్టిన ఆ పార్టీనే రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని  మొదట్లో చర్చ జరిగినా, క్రమంగా ఆ చర్చ పక్కకు జరిగింది. ఇక, జిల్లా విషయానికి వస్తే సంస్థాగత బలహీనత ఆ పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల్లో ఓ మోస్తరు బలంగా కనిపిస్తున్నా... గ్రామస్థాయిలో పార్టీ కోసం పనిచేసే కేడర్ లేకపోవడం కమలనాథులకు గుబులునే మిగులుస్తోంది. పార్టీ కేంద్రంలో అధికారంలోనికి వచ్చినా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం, జిల్లాకు చెందిన పార్టీ నేతలకు పెద్దగా నామినేటెడ్ పోస్టులు కూడా రాకపోవడంతో భవిష్యత్తుపై ఆ పార్టీలో పెద్దగా భరోసా కనిపించడం లేదు.
 
 పోరాటాలే మార్గం...

 ఇక, కమ్యూనిస్టు పార్టీల విషయానికి వస్తే జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీపీఎం, సీపీఐలు ఇప్పుడు అచే తన స్థితిలోకి నెట్టివేయబడ్డాయని రాజకీయ ముఖచిత్రం చెబుతోంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న సీపీఐ ఎప్పటిలాగే పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లు గడుస్తున్నా తమకు పట్టున్న ఒకటి, రెండు నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ కేడర్‌ను పెంచుకోలేకపోయింది. ఇక, తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర పడిన సీపీఎం పూర్తిస్థాయిలో ఆత్మరక్షణలో ఉంది. పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన జూలకంటి రంగారెడ్డి తనదైన శైలిలో ముందుకెళ్తున్నా పార్టీ పుంజుకునేందుకు మరింత శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలుగా కార్మిక, కర్షక, శ్రామిక పోరాటాలకు ఆ పార్టీలు తమ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నాయి.
 
 ఫుల్లు జోష్... పదవులు నిల్
 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌కి రెండేళ్ల రాజకీయ కాలచక్రం మంచి అనుభూతులనే మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికల సమయానికి సాధారణ స్థాయిలోనే ఉన్న టీఆర్‌ఎస్ అధికారమనే అండతో పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీలోనికి దాదాపు జిల్లాలోని అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చాయి. ముఖ్యంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో పాటు వివిధ పార్టీల నేతలు తేరా చిన్నపురెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, గుత్తా జితేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చే రడంతో ఏ కోణంలో చూసినా గులాబీ దండుదే ఆధిపత్యంగా కనిపిస్తోంది.
 
 తొలినాళ్లలో పాలన పరమైన వ్యవహారాల్లో ఉన్న అనుభవలేమిని కూడా అధిగమించిన మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లా అభివృద్ధితో పాటు అటు పార్టీ బలోపేతంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం అందివచ్చిన ఎన్నికలను ఉపయోగించుకుని కేడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో ఆయన సఫలీకృతులయ్యారు కూడా. అయితే, ఈ రెండో ఏడాదిలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అధికార టీఆర్‌ఎస్ కంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికలలో ఓటమిపాలైన గులాబీ దండు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా మరింత పర్యవేక్షణ ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అధికారంలోనికి వచ్చి రెండేళ్లయినా పదవీయోగం రాలేదన్న టీఆర్‌ఎస్ నేతల నిరుత్సాహం, రెండేళ్ల పాలనలో ప్రజలకు అందిన ప్రగతి ఫలాలపై మీమాంస మినహా వరుస ఎన్నికల్లో లభిస్తున్న విజయాలు, పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు అధికార గులాబీ సైన్యాన్ని రెండేళ్ల తర్వాత కూడా ఉత్సాహంలో ఉంచాయని రాజకీయ పరిశీలకులంటున్నారు.
 
 బిగ్‌షాట్స్.. బిగ్ ట్రబుల్స్
 ఇక, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు జిల్లాలో అంత అనుకూల పరిస్థితులేమీ కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటయితే అధికార పీఠంపై కూర్చోవచ్చని ఆశించిన జిల్లా కాంగ్రెస్ బిగ్‌షాట్స్ ఆ షాక్ నుంచి కోలుకున్నట్టు కనిపిస్తున్నా పార్టీ కేడర్‌ను పూర్తి స్థాయిలో రక్షించుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, భిక్షమయ్యగౌడ్... ఇలా చాలా పెద్ద నాయకులే పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలోనే ఉందని రాజకీయ వర్గాలంటున్నాయి.
 
 ఈ రెండేళ్లలో జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి అచ్చి వచ్చిన సందర్భమేదైనా ఉందంటే... అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే. జిల్లాలో మంచి పలుకుబడి ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌ను కంగు తినిపించి కాంగ్రెస్ శ్రేణుల్లో భవిష్యత్‌పై భరోసాను కల్పించారు. కానీ, ఆ తర్వాతి పరిణామాలు ఆ పార్టీకి మళ్లీ చేదు అనుభవాలనే మిగులుస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత అందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాలో మళ్లీ పునర్‌వైభవం కోసం పనిచేయాల్సి ఉండగా, మళ్లీ అదే గ్రూపు తగాదాలు.. వలసలతో పార్టీ ఇంకా ట్రబుల్స్‌లోనే ఉంది. ఇప్పుడిప్పుడే అధికార పార్టీపై ఉద్యమాలకు సిద్ధం అవుతూ, పార్టీ తరఫున సైన్యాన్ని తయారు చేసుకునేందుకు హస్తం పార్టీ సంసిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నా చాలా నియోజకవర్గాల్లో ఘోరంగా దెబ్బతిన్నది. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం, జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత లాంటి పదవులు ఉండడంతో పార్టీ కేడర్ తన పని తాను చేసుకుంటూ పోతోంది.
 
 అయితే, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిర్వహించాల్సిన పోరాటాలే వీ ఈ రెండేళ్లలో ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం గమనార్హం. అయితే, భవిష్యత్తులో మాత్రం అటు పార్టీని రక్షించుకోవడంతో పాటు అధికార టీఆర్‌ఎస్ ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో కాంగ్రెస్ నేతలు క్రియాశీలంగా వ్యవహరించలేకపోతే ఆ పార్టీ కోలుకునేందుకు చాలా కాలమే పడుతుందని రాజకీయ వర్గాల అంచనా.
 
 వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం
 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్‌తో జరిగిన గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం కావాలంటే కష్టపడాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ తరఫున జిల్లాకు చెందిన కీలక నేత, గత ఎన్నికలలో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి గణనీయమైన ఓట్లను సాధించిన డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులు కావడంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నాయి. పార్టీ తరఫున పనిచేసిన అనేక మంది జిల్లా నాయకులకు కూడా గతంలోనే రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు సైతం లభించింది. అయితే, ఈ రెండేళ్ల రాజకీయ పరిణామాలను తాము నిశితంగా అర్థం చేసుకున్నామని, తెలంగాణలో బలీయ శక్తిగా పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రజాపోరాటాలకు త్వరలోనే కార్యరూపం ఇస్తామని వారంటున్నారు.


 

>
మరిన్ని వార్తలు