రాజకీయ క్రీనీడ

12 Sep, 2017 02:54 IST|Sakshi
రాజకీయ క్రీనీడ
 • జిల్లాలో క్రీడా మాఫియా
 • డీపీ నేతల తీరుతో క్రీడారంగం వివాదాస్పదం
 • సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడోల్లో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం
 • ఇద్దరు నిందితులకు పరిటాల శ్రీరాం అండదండలు
 • ఒలింపిక్‌ అసోసియేషన్‌ నిధులు డ్రా చేశారని జేసీ పవన్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
 • జడ్జి, ఎస్పీ కుమారులకు కూడా నకిలీ సర్టిఫికెట్లు!


 • జిల్లాలోని సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడో అసోసియేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కనీసం కోర్టులో దిగకపోయినా మ్యాచ్‌ ఆడినట్లు చూపి సర్టిఫికెట్ల వ్యాపారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్‌ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశు, మురళీకృష్ణలు పరిటాల శ్రీరాంకు అస్మదీయులుగా మెలుగుతున్నారు.

  శ్రీరాం అండతోనే సర్టిఫికెట్ల వ్యాపారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రముఖ వ్యక్తులు హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడు ఆడకపోయినా ఫెన్సింగ్‌ ఆడినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారని సమాచారం. అలాగే న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా ఆడకుండానే సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఎంసెట్‌లో సీటు సాధించేందుకే ఈ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తుండటంతో భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి ప్రముఖులు అండగా ఉంటారనే కారణంతోనే ముఖ్యమైన అధికారులు, రాజకీయనేతల పిల్లలకు ఇలా సర్టిఫికెట్లను కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

  తెరపైకి జేసీ పవన్‌
  ఎంపీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. దీంతో పవన్‌ కూడా 2016లోనే వివాదాల్లోకి వచ్చారని స్పష్టమవుతోంది. గల్లా జయదేవ్, ఎంపీ సీఎం రమేశ్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఒలింపిక్‌ అసోసియేషన్లు ఉన్నాయి. ఇందులో సీఎం రమేశ్‌ వర్గంలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. గల్లా జయదేవ్‌ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఒలింపిక్‌ అసోసియేషన్‌ వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్‌కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్‌ చేసింది. అయితే 2016 జూన్‌ 9న ఫ్రీజ్‌ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్‌తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.

  ‘అనంత’ పరువుకు భంగం
  సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగం లాంటి అంశాలు తెరపైకి రావడం, ఇందులో ‘అనంత’ వాసులే ఉండటంతో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో అనంత పరువుకు భంగం వాటిల్లుతోంది. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అసోసియేషన్లలోకి ప్రవేశించి శాసిస్తుండటంతోనే ఇలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్, క్రికెట్‌తో పాటు చాలా క్రీడల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెరపైకి  వచ్చినవేకాకుండా...ఇంకా అంశాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేస్తున్నారు. క్రీడారంగంలో లేనివారికి అసోసియేషన్‌లో చోటు కల్పించకుండా నిషేధం విధించి, మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు