అధికార దాహం!

1 Aug, 2016 23:09 IST|Sakshi
అధికార దాహం!
ఎస్‌ఎంసీ ఎన్నికల్లో తమ్ముళ్ల పోటాపోటీ
– బరిలో కొత్త, పాత నాయకుల అనుచరులు
– మెజార్టీ ఎస్‌ఎంసీల ఎన్నికలు ఏకగ్రీవం
– కోరం లేక కొన్ని చోట్ల వాయిదా
– నంద్యాల, ఆళ్లగడ్డల్లో భూమా, శిల్పా, గంగుల వర్గీయుల మధ్య పోటీ
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. అధికార పార్టీలోని కొత్త, పాత నేతల అనుచరులు ఆయా స్థానాలకు పోటీపడ్డారు. పలుచోట్ల ఎన్నికలు వాయిదా పడగా.. మరికొన్ని చోట్ల కోరం లేక చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిలిచిపోయాయి. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా నాగిరెడ్డి, గంగల ప్రతాపరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొత్తం మీద చెదురుముదురు ఘటనలు మినాహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్‌ఎస్‌ఏ అధికారి విజయకష్ణారెడ్డి తెలిపారు.
 
ఉదయం ఏడు నుంచే ఎన్నికలు
జిల్లా వ్యాప్తంగా 2,931 పాఠశాలల ఎస్‌ఎంఎసీలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యుల ఎన్నిక, 1.30 నుంచి 2 గంటల మధ్య చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక చేపట్టారు. అయితే మెజార్టీ పాఠశాలల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చాలా స్థానాల్లో సభ్యుల ఎన్నిక నుంచి చైర్మన్, వైస్‌ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు సోమవారం విద్యాసంస్థల బంద్‌ ఉన్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
 
ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో ఉద్రిక్తత
నంద్యాల నియోజకవర్గంలోని వెంకటాపురం పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆహోబిళంలోనూ ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి వర్గీయులు గొడవకు దిగడంతో ఎన్నికను వాయిదా వేశారు. రుద్రవరం మండలంలో వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం నాయకులు పోటాపోటీగా తలపడడంతో ఇక్కడ పది కమిటీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఎన్నిక పోటాపోటీగా సాగింది. ఇక్కడ విష్ణువర్దన్‌రెడ్డి వర్గం పైచేయి సాధించింది.
 
– ఆలూరు నియోజకవర్గం మొలగవల్లిలోని మూడు పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 
– మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని గంగులపాడులో ఎన్నికల సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. 
– పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో ఆరు, గడివేములలో 4, పాణ్యంలో రెండు పాఠశాలల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 
– గడివేముల మండల బూజనూరు, కె.బొల్లవరం ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ జరిగింది.
– నంద్యాలలోని చాబోలు, కలివిసిద్ధి ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అక్కడి యాజమాన్య కమిటీలు ఒప్పుకోలేదు.
– పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెల్దుర్తి బాలికల ఉన్నత పాఠశాల, కొట్టాలలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 
– ఆత్మకూరు నియోజకవర్గంలో ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక్కడ ఎనిమిది పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
– బనగానిపల్లె నియోజకవర్గంలో 17 పాఠశాలల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
 
మొత్తం ఎస్‌ఎంసీలు : 2,931
ఫలితాలు ప్రకటించిన స్థానాలు : 13,345(సభ్యులు)
ఉద్రిక్తత, కోరం లేక వాయిదా పడిన స్థానాలు : 212
( రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు 29 మండలాల ఎస్‌ఎంసీల ఫలితాలు వెలువడినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. )
 
మరిన్ని వార్తలు