దిగజారిన రాజకీయాలు

31 Aug, 2016 00:59 IST|Sakshi
– ధనవంతులే రాజ్యమేలుతున్నారు 
– ప్రజాస్వామ్యం అపహాస్యం
– సెమినార్‌లో సీపీఐ, సీపీఎం నేతల ఆవేదన
 
కర్నూలు సిటీ: రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయని, ధనంతులు చట్టాల రూపకర్తల స్థానంలో వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు ఎంఏ గఫూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయ పార్టీలు ఎన్నికలను అవినీతిమయం చేశాయని ఆరోపించారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో సీపీఐ, సీపీఎం నగర కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం ధన రాజకీయలు– ఎన్నికల సంస్కరణలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలో 542 మంది ఎంపీలుంటే 433 మంది కోటీశ్వరులేనన్నారు. 2009 ఎన్నికల్లో 58 శాతం ఉన్న కోటీశ్వర్లు..నరేంద్ర మోడీ, చంద్రబాబు పుణ్యమా అని ప్రస్తుత ఎంపీల్లో కోటీశ్వరులు 82 శాతానికి పెరిగారన్నారు. ఎమ్మెల్యేఅభ్యరి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు, ఎంపీ అభ్యర్థి రూ. 30 కోట్ల నుంచి రూ. 60 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఇలాంటి వారంతా గెలిస్తే ఖర్చు పెట్టిన సొమ్ము సంపాదించుకోవడంపైనే శ్రద్ధ పెడుతున్నారు కానీ, ప్రజాసంక్షేమంపై కాదన్నారు. జిల్లాకు సంబంధించి ఇటీవలే ప్రతిపక్షం నుంచి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేకు రూ. 7కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంటే కాదు ఇప్పటి వరకు ఇచ్చింది రూ. 3కోట్లేనని ఆయనే చెబుతున్నట్లు సమాచారం. ఇలా రూకలకు సంతలో పశువుల్లా అమ్ముడపోయే వారికి ఓట్లు వేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కమ్యూనిస్టులు ఏ రోజు కూడా పదవుల కోసం ఎన్నికల్లో పోటీ చేయలేదని, ప్రజల తరుపున పేదల గొంతుకను వినిపించేందుకే పనిచేస్తున్నారని తెలిపారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ప్రభాకర్‌ రెడ్డి, రామాంజనేయులు, ఆయా పార్టీల నాయకులు గౌస్‌ దేశాయ్, రాముడు, జగన్నాథం, రసూల్, వామ పక్ష పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు