నేడు పోలింగ్

6 Mar, 2016 05:16 IST|Sakshi
నేడు పోలింగ్

ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్
భారీగా భద్రతా సిబ్బందినియామకం
20 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్
సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో చిత్రీకరణ

 
 ‘అచ్చంపేట నగర చాయతీ’కి సర్వం సిద్ధం
 
ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బహిరంగ ప్రచారం పూర్తయినప్పటికీ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి చివరి నిమిషం వరకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నాగర్‌కర్నూల్ ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే అచ్చంపేట పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరిని పంపించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 18,614 మంది ఓటర్లు ఉండగా, వారిలో  1085 ఎస్టీ, 2792 ఎస్సీ, 8755 బీసీ, 5982 జనరల్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 20 వార్డులకు 17వార్డులు రిజర్వేషన్లు కాగా 3వార్డులు జనరల్‌కు కేటాయించారు.

 భారీ బందోబస్తు
 ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. నగరపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా స్థానిక పోలీసులను భారీగా వినియోగించుకుంటున్నారు. జిల్లా ఆడిషనల్ ఎస్పీతో పాటు మరో ఆడిషల్ ఎస్పీ, 6గురు సీఐలు,30 మంది ఎస్‌ఐలు, 20 మంది ఏఎస్‌ఐలు,300ల మంది పీసీలు,  హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. రెండు స్పెషల్ పార్టీ టీంలు, రెండు వాహన తనిఖీ బందాలు, 6తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్, వనపర్తి డీఎస్పీలు ప్రవీణ్‌కుమార్, జోగుల చెన్నయ్యలు ఇక్కడే మకాం పెట్టి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.


 200మంది ఎన్నికల సిబ్బంది నియామకం
 20 వార్డుల ఓటర్లుకు 20 పోలింగ్ కేంద్రాల్లో 200మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. పీఓలు 25, ఏపీలు 25, ఓపీఓలు 65 మంది, 4రూట్లలో నలుగురు జోనల్ అధికారులు, 8 మంది మైక్రో ఆబ్జర్‌వర్లను నియమించారు. మరో 70 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 20 వార్డుల్లో  పది సమస్యాత్మకంగా, అతి సమస్యాత్మకమైనవిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారి సాబేర్ అలీ తెలిపారు.  20 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో కవరేజ్ ద్వారా పర్యవే క్షించనున్నారు. ఇవీ రెండింటితోపాటు కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకులను నియమించారు. అవసరాన్ని బట్టి అదనంగా వెబ్‌కాస్టింగ్ చేసేందుకు వీలుగా సామగ్రి, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అచ్చంపేటలో ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేకంగా డీఎస్పీలను, సీఐలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


 16గుర్తింపు కార్డుల్ల ఏదో ఒకటి తప్పని సరి..
 పట్టణంలో ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశామ ని, ఎవరికైన అందని పక్షంలో 16 గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తప్పని సరిగా పో లింగ్ కేంద్రాలకు తీసుకురావాలని ఎన్నిక ల అధికారి సాబేర్ అలీ, సహాయధికారి జ యంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ జ రుగుతున్నందున పట్టణానికి లేబర్ హాలీడే ప్రకటించామని, ఎవరు కూడా దుకాణాలు తెరిచి ఉంచవద్దని చెప్పారు. పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

 అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే..
 అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నిక టీఆర్‌ఎస్ పార్టీకి అటు ఐక్యకూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆయా పార్టీలకు చెందిన జిల్లా, రాష్ట్ర నేతలు వారం రోజులుగా అచ్చంపేటలోనే మకాం పెట్టి విజయానికి కావాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నం చేస్తూ మద్యం, డబ్బును ఎరగా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు