ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు సంక్రాంతి సంబరాలు

12 Jan, 2017 00:07 IST|Sakshi
– ఉదయం 9 నుంచి 12 వరకు గ్రామ, మండల స్థాయిలో
–జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు వేడుకలు
– వ్యాఖ్యాతలుగా సీనీ ఆర్టిస్ట్, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, కళాకారిణి చిత్రలేఖలు
–మహిళలకు ముగ్గులు, వంటల పోటీలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వం తరఫున సంక్రాంతి సంబరాలను గురువారం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇందు కోసం రూ. కోటి మంజూరయ్యాయి. గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో 12న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, జిల్లా స్థాయిలో మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించారు.కర్నూలు ఎగ్జిబిషన్‌ గ్రౌండులో మహిళలకు ముగ్గుల పోటీలు, దామోదరం సంజీవయ్య ఉన్నత పాఠశాలలో రాయలసీమ రుచులపై వంటల పోటీలు నిర్వహిస్తారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని కర్నూలులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు జిల్లా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద నృత్యాలు, మ్యూజిక్, మ్యాజిక్‌ షోలు, పోక్‌ డ్యాన్స్‌లు వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రముఖ సీనీ ఆర్టిస్ట్, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, కాళాకారిణి చిత్రలేఖలు వ్యవహరిస్తారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో రాణించిన రైతులు, అధికారులను, కవులు, కళాకారులను ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నారు. జన్మభూమి కార్యక్రమంలో బాగా పనిచేసిన వారినిసైతం సత్కరించనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ప్రశంసా పత్రాలకు అర్హులయిన వారిని జెడ్పీ సీఇఓ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. సంక్రాంతి సంబరాల సందర్భంగా కలెక్టరేట్‌ నుంచి కొండారెడ్డిబురుజు వరకు 3కే రన్‌ నిర్వహించనున్నారు. ముగ్గులు, వంటల పోటీలు తదితద వాటిల్లో విజేతలయిన వారికి బహుమతులు అందచేస్తారు. కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంఎల్‌సీలు తదితరులు పాల్గొననున్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా