గులాబీ గూటికి పొన్నాల?

6 Mar, 2016 03:22 IST|Sakshi
గులాబీ గూటికి పొన్నాల?

త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్న టీపీసీసీ మాజీ చీఫ్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన ‘రాజకీయ పునరేకీకరణ’కు మరో రాష్ట్రస్థాయి నాయకుడు ఆకర్షితుడయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య త్వరలోనే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాలకు సన్నిహితుడైన ఓ కాంట్రాక్టు సంస్థ అధినేత ఆయనకు, టీఆర్‌ఎస్ నాయకత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆ కాంట్రాక్టర్ ఇటీవల హైదరాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఇచ్చిన విలాసవంతమైన విందుకు టీఆర్‌ఎస్ ముఖ్యులతో పాటు పొన్నాల హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరితే తన భవిష్యత్‌కు కచ్చితమైన హామీ ఇవ్వాలన్న పొన్నాల డిమాండ్ మేరకు టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని పొన్నాల కోరినట్లు సమాచారం. అయితే పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్... అందుకు ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన కోడలు వైశాలికి వరంగల్ జిల్లా నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కూడా పొన్నాల కోరినట్లు సమాచారం. ‘పొన్నాల పార్టీలో చేరుతామని మూడు నెలల కిందే వర్తమానం పంపారు. ఆయనతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారు..’’ అని టీఆర్‌ఎస్ ముఖ్యుడొకరు చెప్పారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత పొన్నాల గులాబీ కండువా కప్పుకోన్నుట్లు తెలిసింది.

 వరంగల్‌లో టీడీపీ, కాంగ్రెస్ ఖాళీ
వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో  చేరడంతో ఆ జిల్లాలో టీడీపీకి ప్రధాన నాయకుడే లేకుండా పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో పాటు అనేక మంది నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. గత సాధారణ ఎన్నికలకు ముందే కొండా సురేఖ, ఆమె భర్త మురళి టీఆర్‌ఎస్‌లో చేరగా ఇటీవలే మాజీ మంత్రి బస్వరాజు సారయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పొన్నాల కూడా చేరితే... వరంగల్ జిల్లాలో చెప్పుకోదగ్గ కాంగ్రెస్ నేతల్లో గండ్ర వెంకట రమణారెడ్డి ఒకరే. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం జిల్లాలో మినహా ఎక్కడా కాంగ్రెస్ కి చెప్పుకోదగ్గ నేతలే లేకపోవడం గమనార్హం. ‘ఈ పరిణామం రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఏ మాత్రం మింగుడుపడడం లేదు. కానీ అధిష్టానవర్గం నిద్రపోతుంటే మేం మాత్రం ఏం చేయగలం. పార్టీ నిండా మునుగుతున్నా... రాజకీయానుభవం లేని ఓ మాజీ ఐఏఎస్ అధికారి అభిప్రాయాలకే విలువ ఇస్తున్నారు. చేష్టలుడిగి చూస్తున్న పీసీసీ, సీఎల్పీ నాయకత్వాన్ని మార్చే ప్రయత్నం చేయడం లేదు...’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

 నేను పార్టీ మారడం లేదు: పొన్నాల
ఇదిలా ఉండగా.. తాను పార్టీ మారడం లేదని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శనివారం అర్ధరాత్రి ఆయన సాక్షితో మాట్లాడుతూ.. తాను టీఆర్‌ఎస్ నేతలతో మాట్లాడలేదని, వారిని ఎలాంటి పదవులూ కోరలేదని వివరణ ఇచ్చారు.

మరికొందరితోనూ టీఆర్‌ఎస్ ముఖ్యుల చర్చలు
టీడీపీకి చెందిన మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్‌ఎస్... ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్య నేతలపై దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, దక్షిణ తెలంగాణలో నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇద్దరు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు