దార్శనికుడు జ్యోతిరావుఫూలే

11 Apr, 2017 23:09 IST|Sakshi
దార్శనికుడు జ్యోతిరావుఫూలే
వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ :  సమాజాన్ని ప్రభావితం చేసేలా జ్యోతిరావుఫూలే అనుసరించిన విధానాలు ఆయనను దార్శనికునిగా నిలిపాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. జ్యోతిరావుఫూలే 191వ జయంతిని మంగళవారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ఫూలే విగ్రహానికి కన్నబాబు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ విప్లవాత్మకమైన ఆలోచనలతో అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించాలన్న లక్ష్యంతో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ప్రధానంగా మహిళలు, రైతులు, కార్మికవర్గాల సమస్యలపై ఆయన ఎంతగానో ఉద్యమించారన్నారు. మహిళా విద్య కోసం ఆయన పాటుపడ్డారన్నారు. సరికొత్త ఆలోచనలతో సమాజాన్ని ప్రభావితం చేసి ఇప్పుడు వెనుకబడిన వర్గాలతోపాటు, ఇతర వర్గాల హృదయాల్లో కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నబాబుతోపాటు వైఎస్సార్‌ సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, పార్టీ రాష్ట్ర బీసీసెల్‌ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లిరాజబాబు మాజీ ఎంపీ గుబ్బల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ జవ్వాది సతీష్, మాజీ కౌన్సిలర్‌ చింతపల్లి చంద్రశేఖర్, వైఎస్సార్‌ సీపీ జిల్లా మైనార్టీసెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, పార్టీ మైనార్టీ, వాణిజ్యవిభాగం కన్వీనర్లు అక్బర్‌ అజామ్, పెద్దిరత్నాజీ,  పార్టీ నాయకులు ముత్యాల సతీష్, కడియాల చినబాబు, చింతపల్లి చంద్రశేఖర్, పుప్పాల బాబి, గోపిశెట్టి బాబ్జి, రొంగలి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి త్రిమూర్తులు, రమణాతిమురళి, గంజా సత్తిబాబు, పోరాడ దుర్గాప్రసాద్, గోపిశెట్టి బాబ్జి, నక్కా వీరన్న పాల్గొన్నారు. 
పోరాటాలకు స్ఫూర్తి ఫూలే
– మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం
భానుగుడి (కాకినాడ): పొగొట్టుకున్న హక్కులు పోరాడితేగాని రావన్న స్ఫూర్తిని నింపిన మహనీయుడు జ్యోతిరావుఫూలే అని మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డిసుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో బీసీ వెల్ఫేర్‌శాఖ ఏర్పాటు చేసిన పూలే 191 జయంత్యుత్సవంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత శాంతిభవన్‌ సెంటర్‌లో ఫూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఎస్‌ మాట్లాడుతూ ఫూలే ఆశయాలను, ఆలోచనలను అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు. శూద్రులకు విద్యలేనందున జ్ఞానం లేదని, జ్ఞానం లేనందున నైతికత లేదని, నైతికత లేనందున ఐక్యమత్యం లేదని, ఐక్యమత్యం లేనందున శక్తి లేదని ఈ కారణాల చేతనే శూద్రులు చరిత్రలో అణచివేతకు గురయ్యారని, వారిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి పూలే అహర్నిశలు కృషి చేశారన్నారు. ఫూలేకు భారత రత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేదిక నుంచి డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌లో గొప్ప నాయకుల జన్మదినోత్సవాలు ఉన్నాయని, వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలు దిక్సూచిగా మందుకు సాగాలన్నారు. జెడ్పీ చైర్మన్‌ నామనరాంబాబు మాట్లాడుతూ పూలే పేదలకోసం పాటుపడి చరిత్రలో నిలిచారని, యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో పలు పథకాల్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కెవీ.సత్యనారాయణరెడ్డి, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, బీసీ వెల్ఫేర్‌ డీడీ చినబాబు, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్, ఆర్డీవో రఘుబాబు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు