ఆఖరు గడువు

2 Nov, 2016 02:40 IST|Sakshi
ఆఖరు గడువు

విజయనగరం కంటోన్మెంట్ : పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను బయోమెట్రిక్ కోసం పంపించాల్సిన కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో వేలాది విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులు సంబంధిత అధికారులకు చేరలేదు. దీంతో విద్యార్థులు ఉపకార వేతనాలు పొందే అవకాశాన్ని కొల్పోతున్నారు. ఎన్నిసార్లు యాజమాన్యాలకు చెప్పినా స్పందన కరువైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నో సార్లు గడువులు పొడిగింపు చేశామని, ఈ సారి కూడా ఈ నెల 15 వరకు పెంచామని, అప్పటికీ దరఖాస్తులు పంపకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని బీసీ సంక్షేమ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సంబంధిత నోటీలసులను కూడా సిద్ధం చేస్తోంది.
 
 జిల్లా వ్యాప్తంగా స్కాలర్ షిప్ దరఖాస్తుల వివరాలు..
 జిల్లాలోని దాదాపు 360 కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కొత్తగా, రెన్యూవల్ విభాగాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి దరఖాస్తు ఫారాలను కళాశాల యాజమాన్యాలు బీసీ సంక్షేమాధికారి కార్యాలయానికి పంచిం చాల్సి ఉంది. దానికోసం ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు అక్టోబర్ 31. గడువు ముగిసినప్పటికి కాలేజ్‌ల యాజమాన్యాలు ఇప్పటివరకు దరఖాస్తులను పంపించ లేదు. దీంతో మరోసారి ఈ నెల 15వరకు గడువు పెంచింది. అప్పటిలోగా పంపించకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరికలు పంపింది.
 
  జిల్లాలో 66,279 మంది విద్యార్థులు (ఫ్రెష్, రెన్యువల్ కలిపి) అక్టోబర్ 31 నాటికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం 30,022 దరఖాస్తులు మాత్రమే జిల్లా కేంద్రానికి చేరాయి. పంపించిన మేరకు అధికారులు ఉపకార వేతనాలను మంజూరు చేశారు. మిగతా విద్యార్థుల సంగతి ఏంటన్న విషయం మాత్రం కళాశాలలు పట్టించుకోవడం లేదు. ఈ ఏడాదికి కొత్తగా 28,262 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌లకు దరఖాస్తు చేసుకున్నారు.
 
 వీరిలో కేవలం 4,885 మాత్రమే జిల్లా కేంద్రానికి చేరాయి. అలాగే రెన్యువల్ చేయాల్సిన దరఖాస్తులు 38,017 రిజిస్ట్రేషన్ అయినప్పటికీ అవి కూడా తక్కువగానే అధికారుల చేతికి అందాయి. దీంతో జిల్లాలోని వేలాదిమందికి ఉపకార వేతనాలు అందించే పరిస్థితి లేదు.
 

మరిన్ని వార్తలు