తమ్ముడూ మనకు దిక్కెవరు?

2 Apr, 2016 18:05 IST|Sakshi
తమ్ముడూ మనకు దిక్కెవరు?

ఆపన్న హస్తం కోసం చిన్నారుల ఎదురుచూపు
పసిప్రాయంలోనే తల్లిదండ్రులు దూరమై నరకయూతన

ఒంగోలు:  అల్లారు ముద్దుగా అమ్మ చెంతన.. నాన్న రక్షణలో లోకాన్ని చుట్టేస్తూ హారుుగా గడిపేయాల్సిన ఆ పసికూనలకు ఆదినుంచే కష్టాలు ప్రారంభమయాయి. నానమ్మ చెంత బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అక్కే పెద్ద దిక్కై తమ్ముడిని చేరదీస్తోంది. అమ్మా,నాన్నలు ఏమయ్యారు... ఎందుకిలా మేం అనాథలుగా మిగిలామో కూడా తెలియని ఆ పసి హృదయూలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వయసు మీద పడిన నాన్నమ్మ సపర్యలు చేస్తోంది. ‘నా తదనంతరం వీరి బతుకెలా’ అని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది.

 పాలు తాగే ప్రాయంలోనే తల్లి మృతి..
ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం రామాపురానికి చెందిన ముప్పూరి శేషమ్మ, వెంకటేశ్వర్లకు ఆరేళ్ల వయసున్న నాగచైతన్య, పదకొండేళ్ల వయసున్న నాగేశ్వరిల సంతానం. ఇద్దరూ కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పెద్దమ్మాయిని దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివిస్తున్నారు. సాఫీగా సాగుతున్న వీరి బతుకుల్లో విషాదం చిమ్మింది. బహిర్భూమికి వెళ్లి వస్తుండగా గత ఏడాది జులై నెలలో తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అమ్మలేని తనాన్ని తలచుకొని కుటుంబం కుమిలిపోయింది.

పసి పిల్లాడి రోదన ఆపడం ఎవరి తరం కాలేదు. ఎలానో ఆ బాధను మరిపించి తల్లిలేని లోటును తీర్చి కొత్త జీవితం వైపు అడుగులేయిస్తున్న ఆ తండ్రికి క్యాన్సర్ వ్యాధి కాటేసింది. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చనిపోవడంతో నాన్నమ్మ కొండమ్మే దిక్కయింది. కోడలు, కొడుకు నీడన బతుకు ముగించాల్సిన వయసులో కొండంత కష్టం మీద పడిందని వాపోతోంది. వయసు మీరుతోంది ... తదనంతరం ఈ పిల్లల పరిస్థితేమిటని కళ్లనీళ్ల పర్యంతమవుతోంది ఆ పండుటాకు.

 దాతల సహాయం కోసం ఎదురు చూపు...
దాతల సహాయం కోసం అనాధలు ఎదురు చూస్తున్నారు. అర్థంతరంగా చదువును ఆపేసి తమ్ముడు ఆలనా,పాలనా చూసుకుంటోంది నాగ చైతన్య. తన కష్టం ఎవరికీ చెప్పుకోలేని ఆ పసి హృదయాలను చేరదీసి ఓ మార్గం చూపించాలని పిల్లల నాన్నమ్మ వేడుకుంటోంది. స్పందించే హృదయాలు 94903 24964 నెంబర్‌కు ఫోన్ చేయాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు.

మరిన్ని వార్తలు