తోలు బొమ్మలాట.. వారేవా..!

3 Aug, 2016 23:33 IST|Sakshi
తోలు బొమ్మలాట.. వారేవా..!
గుంటూరు ఎడ్యుకేషన్‌: కలెక్టర్‌ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో బుధవారం తోలు బొమ్మలాట ప్రదర్శన ఇచ్చారు. జిల్లాలోని కట్టుబడివారి పాలేనికి చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు కుమార్‌ బృందం ఇచ్చిన ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి పి. రామచంద్ర రాజు మాట్లాడుతూ భారతదేశంలో కనుమరుగైపోతున్న ప్రాచీన కళల్లో ఒకటైన తోలు బొమ్మలాటను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కళాకారులు తమ నైపుణ్యంతో రాజులు, పురాణ పురుషులను బొమ్మలుగా చేసి కర్రల ఆధారంతో వాటిలో కదలికలు తెచ్చి కళ్లకు ఆకట్టుకునే విధంగా ప్రదర్శించడం కళాకారుల్లో నైపుణ్యానికి అద్ధం పడుతుందన్నారు. ఈసందర్భంగా తోలుబొమ్మలాట కళాకారులు రామాయణ గాధను ప్రదర్శించారు. అనంతరం కళాకారులను సత్కరించి, పారితోషికాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిన ఎన్వీఎస్‌ శాంతారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు