కొలువులు.. పైరవీలు!

13 Jun, 2017 23:33 IST|Sakshi
కొలువులు.. పైరవీలు!
కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో గోప్యత
- దరఖాస్తులు, పోస్టుల వివరాలు వెల్లడించని ఆర్‌యూ వర్గాలు
- కాల్‌ లెటర్లు పంపినా సంఖ్య తెలియదని బుకాయింపు
- తమకే స్పష్టత లేదంటున్న వైస్‌ చాన్స్‌లర్‌
- అనర్హులకు పెద్దపీట వేసే ప్రయత్నం
- భారీగా రాజకీయ నాయకుల సిఫారసులు
 
రాయలసీమ యూనివర్సిటీలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో చేపట్టిన నియామకాలు వివాదాస్పదం అయినప్పటికీ.. మళ్లీ అదే తీరు కొనసాగుతోంది. ప్రస్తుత వైస్‌ చాన్స్‌లర్‌ చేపట్టిన నియామకాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా.. బంధుప్రీతి, అధికార పార్టీ నేతల సిఫారసులకు ఎదురు లేకుండా పోతోంది. 
 
కర్నూలు(ఆర్‌యూ): వర్సిటీలో పోస్టుల భర్తీ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. ఒక్క రోజు ముందు కూడా అధికారులు సరైన వివరాలు వెల్లడించకపోవడం వెనుక భారీగా పైరవీలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సుమారు 75 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా.. 406 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. నియామకంలో రోస్టర్‌ పాయింట్లు ఉండవని.. రిజర్వేషన్లు పాటిస్తామని ఇది వరకు వీసీ ప్రకటించారు. అయితే సబ్జెక్టు వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారనే విషయంలోనూ గోప్యత పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. పోస్టుల భర్తీ విషయంలో పెద్ద ఎత్తున పైరవీలు జరగడం వల్లే వర్సిటీ అధికారులు ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదని తెలుస్తోంది. జిల్లా, రాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా సిఫారసులతో అభ్యర్థులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పోస్టులను అమ్మకానికి పెట్టినట్లు విద్యార్థులు గత సోమవారం వర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టినా అధికారుల్లో చలనం లేకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
 
ఎప్పుడూ లేని వింత పద్ధతి
వర్సిటీలో కొందరు అధ్యాపకులు 10 సంవత్సరాలుగా.. మరికొందరు 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్‌ పద్ధతిన పని చేస్తున్నారు. ఎప్పటికైనా పర్మనెంట్‌ కాకపోతామా అనే ఆశతో వీరంతా నిరీక్షిస్తున్నారు. నియామకం పొందినప్పటి నుంచి ఈ అధ్యాపకులు ఆటోమేటిక్‌ రెన్యూవల్‌ అవుతూ వస్తున్నారు. అయితే తాజాగా కొత్త దరఖాస్తుదారులతో పాటు వీరు కూడా దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పడం వివాదాస్పదం అవుతోంది. ఇంతకాలం వర్సిటీకి సేవలు అందించగా.. తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పాత వారిని సాగనంపే ప్రక్రియగా అభివర్ణిస్తున్నారు.
 
కాల్‌ లెటర్లు పంపిస్తున్నారు.. క్లారిటీ లేదంటారు
కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే ఇంటర్వ్యూ కాల్‌ లెంటర్లు పంపించారు. బుధవారం(14న) నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. అయితే అధికారులు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? ఏ సబ్జెక్టుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అనే విషయాలను బయటకు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో రిజిస్ట్రార్‌కు సంబంధం లేకుండా వీసీ ఎకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
పీడీఎఫ్‌ స్కాలర్స్‌ టీచింగ్‌ అసిస్టెంట్‌లా?
బయో కెమిస్ట్రీ రీసెర్స్‌ స్కాలర్స్‌ అయిన హలీమ్, రజాక్‌లు, పీడీఎఫ్‌లు కమల, కిరణ్‌, సెంథాల్‌లకు యూజీసీ నుంచి రూ.50వేలకు పైగా స్కాలర్‌షిప్‌ వస్తోంది. రీసెర్చ్‌ స్కాలర్స్‌ అయిన వీరిని టీచింగ్‌ అసిస్టెంట్‌లుగా వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. సెంథాల్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ అయినప్పటికీ హెచ్‌ఓడీగా నియమించడం గమనార్హం.
 
అనర్హులకూ కాల్‌ లెటర్లు
దరఖాస్తుకు ముందు రోజు థీసిస్‌ సమర్పించిన ఎంసీఏ రాజేశ్వరికి కాల్‌ లెటర్‌ పంపడం.. ఎంకామ్‌లో పీహెచ్‌డీ చేసిన రేణుక, సురేంద్రలను ఎంబీఏలో ఫ్యాకల్టీలుగా ఎలా అనుమతిస్తారని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సురేంద్ర వినాయక మిషన్‌ అనే యూజీసీ గుర్తింపు లేని సంస్థ నుంచి చెల్లుబాటు కాని పీహెచ్‌డీ సమర్పిస్తే ఎలా కొనసాగిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో చిరంజీవిరెడ్డి గత రెండు సంవత్సరాలుగా అధ్యాపకులుగా పని చేసినా కాల్‌ లెటర్‌ పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు అర్హుడైనా.. ఇప్పుడు ఎందుకు అర్హుడు కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంగ్లిష్‌లో ప్రతాప్‌ అనే అభ్యర్థికి కూడా కాల్‌ లెటర్‌ పంపకపోవడం వెనుక మతలబు ఉన్నట్లు తెలుస్తోంది.
 
అంతా అయ్యాక చెప్తా
అసలు మీకు ఇది వార్తే కాదు. ఎంత మంది దరఖాస్తు చేశారో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో మాకే ఇంత వరకు క్లారిటీ లేదు. నియామకాలన్నీ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తాం.
- నరసింహులు, ఆర్‌యూ వీసీ
 
నేటి నుంచి ఇంటర్వ్యూలు
రాయలసీమ యూనివర్సిటీలో నేటి నుంచి కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 14వ తేదీన ఓఆర్‌ అండ్‌ ఎస్‌క్యూసీ, మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్‌, 16న ఎడ్యుకేషన్, కంప్యూటర్స్‌ సైన్స్, 17న ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, 18న ఎకనామిక్స్, 19న కామర్స్, ఎంబీఏ, 20న బోటనీ, జువాలజీ, బయో టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, 21న తెలుగు సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ తెలిపారు.
 
మరిన్ని వార్తలు