ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ అర్హతలతో పోస్టులు

17 Nov, 2015 01:16 IST|Sakshi
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ అర్హతలతో పోస్టులు

సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్ విద్యార్హతలతో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులకు నిర్వహించే పోటీ పరీక్షల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోటీ పరీక్షల్లో ఉండే పేపర్లు, మార్కుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. బిల్ కలెక్టర్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. నియామక ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించింది. టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష విధానాన్ని రూపొందించింది.

కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం విద్యార్హతలకు అనుగుణంగా సంబంధిత పోస్టుల పరీక్ష ప్రణాళికను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సెస్సీ తత్సమాన విద్యార్హత ఉన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్ పేపర్ ఒకటే ఉంటుంది. ఈ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. ఇక ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతలున్న పోస్టులకు జనరల్ నాలెడ్జ్, సెక్రెటేరియల్ ఎబిలిటీస్ పేరుతో ఒక పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి 75 ప్రశ్నలు, సెక్రెటేరియల్ ఎబిలిటీస్‌కు 75 ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఈ పేపర్‌కు 150 మార్కులుంటాయి. అలాగే ఐటీఐ లేదా తత్సమాన అర్హతలున్న పోస్టులకు జనరల్ నాలెడ్జ్, సంబంధిత ఐటీఐ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 75 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 75 ప్రశ్నలుంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి.

>
మరిన్ని వార్తలు