-

పోతిరెడ్డిపాడు టు శ్రీశైలం పాదయాత్ర

30 Aug, 2016 22:45 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రకటన
– సాగునీటి సాధన కోసమేనని వెల్లడి 
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): జిల్లా రైతుల కోసం త్వరలో పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం వరకు 140 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తానని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక కళావెంకట్రావ్‌ భవనంలో మంగళవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో కోట్లతో పాటు 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్‌ తులసీరెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కోట్ల విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం జిల్లా ప్రజలు విలువైన భూములు, ఇళ్లు త్యాగం చేశారని, అయితే ప్రస్తుత పాలకులు నీటిమట్టం తగ్గించడం ద్వారా ఆ నీటిని రాయలసీమకు రాకుండా చేశారని ఆరోపించారు. చివరికి డెడ్‌ స్టోరేజీ దశలోనూ దిగువకు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు జిల్లాల సాగునీటి సాధన కోసమే పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పాలకులకు రాయలసీమపై ఏమాత్రం ప్రేమ ఉన్నా గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని తులసీరెడ్డి అన్నారు. రాజధాని, హైకోర్టూ కోస్తాకే (గుంటూరుకు) రాయలసీమ ప్రజలను మోసగించడమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్‌ బుచ్చిబాబు, మైనారిటీ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ అహ్మద్‌అలీఖాన్, జెడ్పీ మాజీ చైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు