రేపటి నుంచి కోళ్ల ప్రదర్శన

24 Nov, 2015 01:44 IST|Sakshi

{పారంభించనున్న సీఎం కేసీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో భారత కోళ్ల ప్రదర్శన జరుగనుంది. ఈ ప్రదర్శనను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బాల్య న్ ఇందులో పాల్గొంటారు. ఈ నెల 24న సాంకేతిక విజ్ఞాన సదస్సు జరగనుంది. కోళ్ల ప్రదర్శన వివరాలను భారతీయ కోళ్ల పెంపకం పరికరాల తయారీదార్ల సంఘం అధ్యక్షుడు హరీశ్‌గార్వారే, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, చక్రధర్‌రావు, సుబ్బరాజు, బాలస్వామి తదితరులు సోమవారం వివరించారు. ఈ ప్రదర్శనలో 180 దేశీయ, 40 విదేశీ సంస్థలు రకరకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని తెలిపారు. ప్రదర్శనను తిలకించేందుకు దాదాపు 25 వేల మంది హాజరవుతారని తెలిపారు.

భారత్ దాదాపు 6,500 కోట్ల గుడ్లు, 3.80 కోట్ల టన్నుల కోడి మాంసం ఉత్పత్తి చేస్తోందని, దీంతో రూ.90 వేల కోట్ల జాతీయాదాయం సమకూరుతోందని పేర్కొన్నారు. కోళ్ల పెంపకానికి దేశంలో విస్తారమైన అవకాశాలున్నాయన్నారు. దేశంలో తలసరి 4 కేజీల కోడిమాంసం, 57 గుడ్లు వినియోగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా మాత్రం సగటున 11.2 కేజీల కోడి మాంసం, 155 గుడ్లు వినియోగిస్తున్నారని చెప్పారు. పోషకాహారలోపం, మాంసకృత్తుల ప్రయోజనాలపై ఉద్యమం చేపట్టామని, సెప్టెంబర్‌లో తొలి దశ ఉద్యమం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పోషకాహార వారోత్సవాలు నిర్వహించాలని జాతీయ పోషకాహార సంస్థను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధానికి నివేదించినట్లు పేర్కొన్నారు. లేయర్ పరిశ్రమ అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, కేంద్రం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరడం లేదని వాపోయారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.

మరిన్ని వార్తలు