ఆర్థిక ఆంక్షల సెగ

16 Apr, 2017 23:35 IST|Sakshi
ఆర్థిక ఆంక్షల సెగ
కొనుగోళ్లకు వెనుకడుగేస్తున్న ట్రేడర్లు, చిరు వ్యాపారులు
స్థానిక ఎగుమతులపై ప్రభావం
పౌల్ట్రీల్లో పేరుకుపోతున్న గుడ్లు
రూ.2.55కు పతనమైన రైతు ధర
రోజుకు రూ.77 లక్షల మేర నష్టం
ఆందోళనలో కోళ్ల రైతులు
మండపేట : మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన తయారైంది జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి. సీజ¯ŒSలో గుడ్డు ధర తీవ్రంగా నిరాశపరచగా.. తాజాగా ఆర్థిక ఆంక్షలు పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వేసవి ఎండలకు తోడు ఆర్థిక ఆంక్షలతో గుడ్ల కొనుగోళ్లకు, ఎగుమతులకు ట్రేడర్లు, చిరు వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతుండగా.. రైతు వద్ద ధర నానాటికీ పతనమవుతోంది. ఇప్పటికే రూ.2.55కు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు రోజుకు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. మున్ముందు మరింతగా పెరగనున్న ఎండలతో పరిశ్రమకు మరిన్ని కష్టాలు తప్పవని కోళ్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 1.30 కోట్ల కోళ్లుండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. 40 శాతం గుడ్లు స్థానికంగా వినియోగమవుతుండగా, మిగిలినవి పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. చలి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల ఎగుమతులకు డిమాండ్‌ పెరిగి, నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్డు ధర ఆశాజనకంగా ఉంటుంది. అయితే నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో ఈ ఏడాది సీజ¯ŒSలో రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. పరిశ్రమకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇటీవల లారీల సమ్మెతో గుడ్ల ఎగుమతి స్తంభించిపోయింది.
ఆ సమ్మె ముగిసినా, ఆర్థిక ఆంక్షలు, ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. నగదు రహిత లావాదేవీలు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో లావాదేవీలన్నీ చెక్కుల రూపంలోనే నిర్వహించాల్సి రావడం వ్యాపారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. చెల్లింపులు జరిపిన చెక్కులకు సమాధానం చెప్పాల్సి రావడం, ఆర్థిక ఆంక్షలకు సంబంధించి వ్యాపారులు, కోళ్ల రైతులకు సరైన అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. లావాదేవీల్లో ఏ చిన్నపాటి లోపం చోటుచేసుకున్నా రూ.లక్షల్లో జరిమానాలు చెల్లించాల్సి రావడంతో ట్రేడర్స్‌తో పాటు స్థానిక వ్యాపారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఎండల ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం తగ్గుముఖం పడుతోంది. ఈ కారణాలతో పది రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులు, స్థానిక వినియోగం సగం వరకు తగ్గిపోగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతున్నాయి. సాధారణంగా జిల్లా నుంచి రోజుకు సుమారు 50 లారీల గుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అది 25 లారీలకు పడిపోయింది. స్థానిక వినియోగం కూడా తగ్గిపోవడంతో పౌల్ట్రీల్లో గుడ్ల నిల్వలు పెరిగిపోతున్నాయని కోళ్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. నెక్‌ ప్రకటిత ధర కూడా అందని దుస్థితిలో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
మేత, కూలీల ఖర్చులు పెరిగిపోవడం, వేసవి ఉపశమన చర్యలు తదితర కారణాలతో గుడ్డు రైతు ధర రూ.3.25 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత రైతు ధర రూ.2.55 ఉండగా, రోజుకు ఒక్కో గుడ్డు రూపంలో 70 పైసల వరకూ కోళ్ల రైతులు కోల్పోవాల్సి వస్తోంది. దీని ప్రకారం పరిశ్రమకు రోజుకు సుమారు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు చెబుతున్నారు. మున్ముందు వేసవి ఎండలు, వడగాలుల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోతుందని, దీంతోపాటు కోళ్ల మరణాలు పెరిగి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
>
మరిన్ని వార్తలు