కట్‌.. కటా

22 Jul, 2017 22:40 IST|Sakshi
కట్‌.. కటా

– సర్వజనాస్పత్రిలో కరెంటుకోత
- జనరేటర్‌ లేక అలముకున్న చీకట్లు
 – నిలిచిన ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, కంటి పరీక్షలు
- అల్లాడిపోయిన రోగులు


అనంతపురం మెడికల్‌: అనంతపురంలోని సర్వజనాస్పత్రి...పేదవాడికి ఏ కష్టమొచ్చినా పరుగుపరుగున వచ్చేది ఇక్కడికే. కానీ అత్యవసర సమయంలో ఇక్కడికొస్తున్న వారు వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వజనాస్పత్రిలో కీలక విభాగాలకు జనరేటర్‌ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో రోగులంతా అంధకారంలో అల్లాడిపోతున్నారు. మరోవైపు కరెంటుతో ముడిపడి ఉన్న పలు పరికరాలు గంటల తరబడి నిరీక్షించి నీరసనపడుతున్నారు. తాజాగా శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు సర్వజనాస్పత్రిలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింగి. దీంతో ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌తో పాటు కంటి పరీక్షలు నిలిచిపోయాయి.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అంతసేపు నిరీక్షించలేక వెనుదిరుగగా....వార్డుల్లో అడ్మిషన్‌లో ఉన్న వారు పరీక్షల కోసం గంటల తరబడి స్కానింగ్‌ గదుల ఎదుట పడిగాపులు కాశారు. పనిలేక కొందరు సిబ్బంది వార్డుల్లోనే సెల్‌ఫోన్లలో గేమ్స్‌ ఆడుకుంటూ కాలక్షేపం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినా, కడుపు నొప్పితో వచ్చినా ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ తప్పనిసరి. ఈ క్రమంలో ఉన్నతాధికారులు స్పందించి ఆయా విభాగాలకు ప్రత్యేకంగా జనరేటర్లు ఏర్పాటు చేయిస్తే భవిష్యత్‌లో అయినా ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు